ఇసుక రాయల్టీతో రూ.1,200 కోట్ల ఆమ్దానీ..రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టినం : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇసుక రాయల్టీతో రూ.1,200 కోట్ల ఆమ్దానీ..రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టినం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర ఖజానాకు నష్టం
  •     మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     చెన్నూరులో  ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ కు  శంకుస్థాపన

కోల్​బెల్ట్/ కోటపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేశామని, ఈ ఏడాది రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి  రూ.1200 కోట్ల ఆదాయాన్ని తీసుకవస్తామని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించడంతోపాటు సర్కార్​కు ఎక్కువ ఆమ్దానీ రాబట్టేలా  పనిచేస్తున్నట్లు చెప్పారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్​ వెంకటస్వామి, -సరోజ దంపతులు పర్యటించారు. రోడ్డు విస్తరణలో షాప్​లు కోల్పోయిన చిరువ్యాపారుల కోసం 15వ వార్డులో  రూ.కోటి డీఎంఎఫ్​టీ నిధులతో నిర్మించనున్న షాపింగ్​ కాంప్లెక్స్​పనులకు మున్సిపల్​చైర్​పర్సన్​ పెద్దింటి పద్మ, వైస్​ చైర్మన్​ నాయకపు వినయ్​తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి, వైద్య సేవలపై సమీక్షించారు. అలాగే శ్రీ మధున పోచమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. 

అనంతరం ఆలయ చైర్మన్​సతీశ్, పాలకవర్గ సభ్యులతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో  మంత్రి వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రూ.700 కోట్లకు మాత్రమే పరిమితమైన ఇసుక రాబడిలో  రూ.300 కోట్లను బీఆర్ఎస్​ లీడర్లు మింగారని, రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారన్నారు. తాను మైనింగ్​మినిస్టర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచామని చెప్పారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇసుక రాయల్టీ ద్వారా రూ.600 కోట్ల ఆదాయాన్ని తీసుకవచ్చామని, ఈ ఏడాది మొత్తం  రూ.1,200 కోట్ల ఆమ్దానీ తీసుకవస్తామన్నారు. కార్మిక శాఖలో రూ.150 కోట్ల  కుంభకోణం జరిగిదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​అయ్యారు.  బీఆర్ఎస్​హయాంలో డెత్​ సర్టిఫికెట్లకు సంబంధించిన స్కీం అమలు జరిగిందని,  అప్పుడే అక్రమాలు జరిగాయన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక బీఆర్ఎస్​ లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

చెన్నూర్​ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

చెన్నూర్ పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్​చెప్పారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల కోసం 70 షాపులతో షాపింగ్ కాంప్లెక్స్‌‌ను 3, 4 నెలల్లో నిర్మిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1.60 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించామని, గోదావరి పుష్కరాల కోసం రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రూ.17 కోట్లతో శివాలయాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు. వెజిటేబుల్​మార్కెట్ అభివృద్ధి కోసం రూ.20 లక్షలు కేటాయించామని, నాన్‌‌వెజ్ మార్కెట్, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

చెన్నూరులోని శ్రీ మధున  పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు  కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం పెద్ద హాల్, టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆలయ పాలకవర్గానికి సూచించారు. అలాగే కోటపల్లి మండలం అలుగాంలో  ఫారెస్ట్​ ఆఫీసర్​ దాడిలో గాయపడిన మేకల కాపరులు కోర్తె సంతోష్​, మారబోయిన ఓదెలును మంత్రి పరామర్శించారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. మంత్రి వెంట చెన్నూరు మార్కెట్​ కమిటీ చైర్మన్​ మహేశ్​ తివారి, తహసీల్దార్​ మల్లికార్జున్, డీసీహెచ్ఎస్​డాక్టర్​ కోటేశ్వర్ రావు, ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.