మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం తాళ్లపేటలో నిన్న రాత్రి జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆదివాసీ గిరిజన సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ తిరుపతిపై జరిగిన దాడిని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన మహిళా సర్పంచ్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు ఆందోళనకరమన్నారు.
ఆదివాసీ గిరిజన మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ గిరిజన మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.
