పిల్లలకు పేరు పెడుతున్నారా? న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా పెట్టాలి? ఈ నంబర్లు వస్తే కష్టాలు తప్పవా?

పిల్లలకు పేరు పెడుతున్నారా? న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా పెట్టాలి? ఈ నంబర్లు వస్తే కష్టాలు తప్పవా?

బిడ్డకు పేరు పెట్టడం అనేది తల్లిదండ్రుల జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం. కొందరు వాళ్ళ  సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం పేరు పెడితే.. మరికొందరు పేరులోని అర్థానికి, ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంటే  సంఖ్యాశాస్త్రవేత్త, వాస్తు నిపుణుల  ప్రకారం.. తల్లిదండ్రులు పేరు పెట్టేటప్పుడు 'న్యూమరాలజీ'ని కూడా కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ మధ్య  ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఆయన మాట్లాడుతూ.. పేరు పలకడానికి బాగుండటంతో పాటు, ఆ పేరుకు వచ్చే నంబర్ (సంఖ్యా విలువ) కూడా చాలా ముఖ్యమని చెప్పారు. పిల్లల పేరును ఫిక్స్  చేసే ముందు తల్లిదండ్రులు పాటించాల్సిన మూడు ముఖ్యమైన నియమాలను ఆయన చెప్పుకొచ్చారు....

న్యూమరాలజీ ప్రకారం పేరు ఎందుకు ముఖ్యం
న్యూమరాలజీ అనేది పేరులోని అక్షరాలకు కొన్ని నంబర్లను కేటాయించి, వాటి ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, వారి భవిష్యత్తు, జీవితంలో వచ్చే అవకాశాలను అంచనా వేసే ఒక నమ్మకం.

సంఖ్యాశాస్త్రవేత్త, వాస్తు నిపుణుల ప్రకారం.. పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాదు. పేరులోని అక్షరాల మొత్తం నంబర్ ఒక రకమైన వైబ్రేషన్ సృష్టిస్తుంది. ఇది ఆ వ్యక్తి జీవితకాల ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా మంది ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు, పాటిస్తారు.

రూల్ 1: పేరు మొత్తం టోటల్ నంబర్ తెలుసుకోండి
పేరు పెట్టే ముందు ఆ పేరులోని అక్షరాలన్నింటినీ కలిపితే వచ్చే మొత్తం నంబర్ (టోటల్) ఎంతో కనుక్కోవడం మొదటి స్టెప్.. ఆ పేరు ఇచ్చే వైబ్రేషన్ మొత్తం ఆ చివరి నంబర్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పేరు కేవలం మోడరన్‌గా ఉందా, ట్రెండీగా ఉందా అని మాత్రమే చూడకుండా.. దాని టోటల్ నంబర్ ఎంత వస్తుందో కూడా లెక్కలేసుకోవాలి.

రూల్ 2: టోటల్ నంబర్ '4' లేదా '8' రాకుండా చూసుకోండి
పేరులోని అక్షరాల మొత్తం కూడితే 4 లేదా 8 నంబర్లు రాకూడదు. న్యూమరాలజీ ప్రకారం 4 అంటే రాహువు, 8 అంటే శని అని అర్ధం. ఈ నంబర్లు జీవితంలో ఇబ్బందులను, కష్టాలను తెచ్చిపెడతాయి. అందుకే పేరు  టోటల్ నంబర్ ఈ రెండు రాకుండా చూసుకోవడం మంచిది.

రూల్  3: పేరును పిల్లల  పుట్టిన తేదీ నంబర్ తో మ్యాచ్ చేయండి
3వ రూల్  పుట్టిన తేదీ నంబర్ కు సంబంధించినది. పిల్లలు పుట్టిన తేదీ ఆధారంగా ఈ నంబర్‌ను లెక్కిస్తారు. పిల్లల  పుట్టిన తేదీ  నంబర్‌ను బట్టి కొన్ని నంబర్లు వచ్చే పేర్లను అస్సలు పెట్టకూడదు. ఉదాహరణకు:

 పుట్టిన తేదీ నంబర్ 1 అయితే: పేరు  టోటల్ 8 రాకూడదు.

 పుట్టిన తేదీ  నంబర్ 2 అయితే: పేరు  టోటల్ 4, 8 ఇంకా 9 రాకుండా చూసుకోవాలి.

 పుట్టిన తేదీ నంబర్ 3 అయితే: పేరు  టోటల్ 6 రాకూడదు.

పుట్టిన తేదీ నంబర్‌కు, పేరులోని నంబర్‌కు మ్యాచ్ కాకపోతే జీవితంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు. చాలా కుటుంబాలలో న్యూమరాలజీ అనేది ఒక సాంప్రదాయంగా లేదా నమ్మకంగా వస్తోంది. ఏదేమైనప్పటికీ,  పుట్టిన పిల్లలలకు ఎలాంటి పేరు పెట్టాలనేది చివరికి తల్లిదండ్రుల వ్యక్తిగత ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.  

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.