OTT Thriller Review: ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు

OTT Thriller Review: ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు

తేజస్వి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సైకో సైయాన్' (Psycho Saiyaan). 25 ఫిబ్రవరి 2026 నుంచి అమెజాన్ MX ప్లేయర్‌‌‌‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. అజయ్ భూయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనుద్ సింగ్ ధాకా మరియు రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు.

యశ్‌పాల్ శర్మ, అశ్విని కాల్సేకర్, సుర్భి చందన, సృష్టి శ్రీవాస్తవ, వరుణ్ భగత్ లాంటి వాళ్లు కూడా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లతో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

కథేంటంటే:

కార్తీక్ పాండే (అనుద్ సింగ్ ఢాకా) .. చారులత (తేజస్వి ప్రకాష్)ని ప్రేమిస్తాడు. అతను ఆమె కంటే వయసులో చిన్నవాడని తెలిసినా ప్రేమని వదులుకోడు. చారులతని తన అదృష్టంగా భావిస్తాడు. చారు మొదట్లో కార్తీక్‌‌ పట్ల ఇంట్రెస్ట్ చూపించకపోయినా తర్వాత ప్రేమిస్తుంది. 

అప్పుడే కథలోకి క్రూరమైన గ్యాంగ్‌‌స్టర్, రాజకీయ నాయకుడు హంట్రీ చౌహాన్ (రవి కిషన్) ఎంట్రీ ఇస్తాడు. అతను కూడా చారులత మీద మనసుపడతాడు.

ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. కార్తీక్‌‌ మాత్రం ఆమెని కాపాడేందుకు పోరాడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చారులత ఎవరికి దక్కింది? తెలియాలంటే సిరీస్‌‌ చూడాలి.

ఎలా ఉందంటే:

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నేపథ్యంలో సాగే డార్క్ అబ్సెషన్ కథ ఇది. ఈ కథ ప్రేమ, వ్యామోహం, అధికారం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ ప్రేమకథగా మొదలయ్యే ఈ కథ, క్రమంగా తీవ్ర భావోద్వేగాల వైపు మళ్లి, నేరాలకు ఎలా దారితీస్తుందో సస్పెన్స్‌తో చూపిస్తుంది. ప్రేమ అతి స్థాయికి వెళ్లినప్పుడు అది ఎంత ప్రమాదకరమవుతుందో ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపించింది.

కార్తీక్ (అనుద్ సింగ్ ఢాకా) ప్రేమలోని అమాయకత్వం, హంట్రీ చౌహాన్ (రవి కిషన్) పాత్రలో కనిపించే క్రూరత్వం మధ్య జరిగే సంఘర్షణ కథకు బలంగా నిలుస్తుంది. మొదటి ఎపిసోడ్లు కొంచెం నెమ్మదిగా సాగినా, తర్వాతి భాగాల్లో సస్పెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.