Peddi Movie Piracy: రామ్ చరణ్ 'పెద్ది'కి పైరసీ షాక్.. హెచ్‌డీ ప్రింట్ లీక్‌తో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!

Peddi Movie Piracy: రామ్ చరణ్ 'పెద్ది'కి పైరసీ షాక్.. హెచ్‌డీ ప్రింట్ లీక్‌తో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. చరణ్ సోలో కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అటు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

'పెద్ది'కి షాక్

కానీ.. ఈ బాక్సాఫీస్ ఛాంపియన్ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సినిమా విడుదలైన రెండో రోజే టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ భూతం 'పెద్ది'ని సైతం వెంటాడుతుంది. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లలో ఈ సినిమాకు సంబంధించిన హై-క్వాలిటీ హెచ్‌డీ (HD) ప్రింట్ లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. పైరసీతో చిత్ర యూనిట్ తో పాటు, ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైరసీ లింకులపై  సోషల్ మీడియా వేదికగా అభిమనులను  అలర్ట్ చేశారు.

 

కలెక్షన్లపై పైరసీ దెబ్బ?

మరో వైపు  వీకెండ్‌ కావడంతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఆన్‌లైన్ లీకేజీ మేకర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. థియేటర్లలో చూడాల్సిన విజువల్ వండర్‌ను మొబైల్ స్క్రీన్స్‌పై డిజిటల్ దొంగలు వదిలేయడంతో.. సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఆగ్రహం 

ఈ దారుణంపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. థియేటర్లలోనే సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించకండి అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు, చిత్ర డిజిటల్ టీమ్ తక్షణమే స్పందించి ఆ లింకులను ఇంటర్నెట్ నుండి తొలగించాలని కోరుతున్నారు. ఈ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైరసీ లింకులు కనిపిస్తే అధికారిక ప్రొడక్షన్ హౌస్‌కు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు. మరి ఈ పైరసీ అడ్డంకులను దాటుకుని 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.