సముద్ర తీర ప్రాంతంలో అమెరికా రాజకీయ నాయకుడు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ ఒట్టి చేతులతో రెండు బతికున్న నల్లటి పాములను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఒకవైపు ఆశ్చర్యపోతుంటే, మరోవైపు భయపడుతున్నారు. కెన్నెడీ స్వయంగా ఈ క్లిప్‌ను ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన పాములను పట్టుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఆయన భార్య, కుటుంబికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రాబర్ట్ కెన్నెడీ ఆ రెండు పాములను గాలిలోకి ఎత్తి చుట్టూ ఉన్నవారికి చూపిస్తుండగా, అవి ఆయన చేతుల్లోంచి తప్పించుకోవడానికి గాల్లో మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నాయి.
ఆ సమయంలో అక్కడే ఉన్న కెన్నెడీ భార్య, నటి అయిన చెరిల్ హైన్స్ భయంతో.. "అవి చాలా ప్రమాదకరం, ప్లీజ్ వాటిని వదిలేయ్.. వెళ్లనివ్వు" అని పదే పదే చెప్పడం వీడియోలో వినిపిస్తుంది. అయినసరే కెన్నెడీ మాత్రం అస్సలు భయపడకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఆ పాములను పట్టుకునే ఉన్నారు. ఆ పాముల్లో ఒకటి ఆయన చేతిపై కరిచినట్లు అనిపించినా, ఆయన ఏమాత్రం కంగారు పడలేదు.
కెన్నెడీ పట్టుకున్న పాములను 'బ్లాక్ రేసర్స్' అంటారు. ఇవి విషం లేని పాములు. అమెరికాలోని తీరప్రాంతాలు, అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చాలా వేగంగా పాకగలవు. వీటికి కోపం వచ్చినా లేదా ఎవరైనా పట్టుకోవాలని చూసినా వెంటనే తిరగబడి కరుస్తాయి. కానీ, వీటి వల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం ఎం ఉండదు. ఈ పాములు ఎవరైనా వాటిని ఇబ్బంది పెడుతున్నారని భావిస్తే, ఒంటి నుంచి ఒక రకమైన దుర్వాసనను బయటకు వదులుతాయి.
జంతు నిపుణుల ప్రకారం.. పాములకు విషం ఉన్నా లేకపోయినా, అడవి పాములను చేతులతో పట్టుకోవడం అస్సలు మంచిది కాదు. మనం పట్టుకున్నప్పుడు అవి ఒత్తిడికి గురై ఆత్మరక్షణ కోసం గట్టిగా కరిచే అవకాశం ఉంటుంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది కెన్నెడీ ధైర్యాన్ని చూసి అబ్బా ఎంత ధైర్యం అని కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం వన్యప్రాణులను ఇలా అనవసరంగా పట్టుకుని ఇబ్బంది పెట్టడం తప్పు అని విమర్శిస్తున్నారు. పాము కరిచినా కూడా ఆయన అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
