- ఢిల్లీలో నిరసనలు, సుప్రీంకు మార్చ్, సర్ అంశాలపై విచారణ
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు
- సుప్రీంకు మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
- న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని కామెంట్
- జంతర్ మంతర్ డీనోటిఫైపై కేంద్రం, ఢిల్లీ పోలీసుల వివరణ కోరిన సీజే
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో భారీగా పేర్ల తొలగింపు, సర్‌లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరో 12 మంది ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అందరి వాదనలు వింటామని స్పష్టం చేసింది. సర్, ఢిల్లీలో నిరసనలు, సుప్రీంకోర్టు వరకు ప్రతిపక్ష నేతలు చేపట్టిన మార్చ్, జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడుల ఆరోపణలకు సంబంధించిన పలు పిటిషన్లను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం విచారించింది.
అక్టోబర్ 12న రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టు వరకు చేపట్టిన మార్చ్ అంశంనూ ప్రత్యేకంగా విచారణ జరిపారు. ఈ మార్చ్ ద్వారా న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని కొందరు న్యాయవాదులు సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని అని స్పష్టం చేశారు. ‘‘మేం ఏకాంత మందిరాల్లో కూర్చోలేదు. బయట వారు ఏం మాట్లాడుతున్నారు, కోర్టులో ఏం చెబుతున్నారు అన్నది మాకు తెలుసు. ప్రతిదీ గమనిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
పిటిషనర్లలో ఒకరి వ్యవహారశైలిని కూడా పరిగణనలోకి తీసుకున్నామని ధర్మాసనం ప్రత్యేకంగా పేర్కొంది. అయితే ఆ పిటిషనర్ ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు. 12న సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన మార్చ్‌ను సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పైనా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. కాగా, సర్‌ను రద్దు చేయాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఎన్నికల సంఘానికి, ఇతర సంబంధిత వర్గాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
‘జంతర్ మంతర్’పై కేంద్రానికి నోటీసులు
ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై గురువారం కోర్టు స్పందిస్తూ.. ‘‘కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం. వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని స్పష్టం చేసింది. అయితే, ఒక ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సుల మేరకే జంతర్ మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగించినట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. మరోవైపు, అక్టోబర్ 11న ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదానాలను నిరసనల కోసం ప్రత్యామ్నాయ వేదికలుగా కేటాయించారు. ఈ కొత్త వేదికల్లో ఆందోళనలు చేపట్టేందుకు ప్రత్యేక నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు.
