కర్తవ్యం ....బాధ్యత.....రెండూ మానవ బాధ్యతలు కానీ ఈ రెండిటికి కొద్దిపాటి తేడా ఉంది. కర్తవ్యం అనేది ఒక సాధారణ పదం, నైతిక లేదా చట్టపరమైన బాధ్యత అయితే, "బాధ్యత" అనే పదం ఎక్కువగా చట్టపరమైన బాధ్యతను సూచిస్తుంది.అది నెరవేరకపోతే చట్టపరమైన పరిణామాలను కలిగి ఉంటుంది..కర్తవ్యం..బాధ్యత అంటే ఏమిటి..ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం..!
కర్తవ్యం, బాధ్యత అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరువేరు.
- విధి నిర్దేశించేవి కర్తవ్యాలు
- కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు.
కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు)ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు(అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు.తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు.
పురాణాల ప్రకారం .. త్రేతాయుగంలో ఓఇద్దరు మహర్షులను పరిశీలిస్తే కర్తవ్యం.. బాధ్యత ఈ రెండిటి గురించి బాగా తెలుస్తుంది. శ్రీరామ చంద్రుడిని ఓ ఇంటి వాడిని చేసింది ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. కన్న తండ్రి దశరథ మహారాజో.. శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి జనక మహారాజో కాదు.. సీతారాముల కళ్యాణాన్ని విశ్వామిత్రుడు శ్రీకారం చుట్టాడు.
అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. శ్రీరాముడి పుట్టుక లోకకల్యాణం.. సీతారామకల్యాణం అనేవి రెండూ విశ్వామిత్రుని ప్రధాన కర్తవ్య లక్ష్యాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివడినది. రెండోది- ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ.
విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణమనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం మాత్రమే. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు.
స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం! సీతారామకల్యాణం పూర్తవగానే విశ్వామిత్రుడు రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం.
ఇక మిగిలిన పని అంతా శ్రీరాముడు బాధ్యతగా తీసుకున్నాడు. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్ మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే!
రామ..రావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. ఆ తరువాత ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు.
తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని!
కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!
పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం.పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు... దాని కొనసాగింపు మాత్రమేనని గ్రహించాలి. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.
