ఇల్లందు, వెలుగు: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఇల్లందు నియోజకవర్గంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు. ఇల్లందులో నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. జేకే కాలనీలో నిర్మించిన మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు.
అక్కడి క్రీడాకారులతో కలిసి పలు ఆటలు ఆడుతూ ఉత్సాహపరిచారు. అనంతరం 24వ వార్డులో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. మేడికుంట -రామచంద్రపురం రహదారిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు.
తిలక్‌నగర్‌లో నిర్మించిన 8 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అభివృద్ధి పనులు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, వివిధ శాఖల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
