విరిగిన పాలతో ఏమేం చేయొచ్చంటే..

విరిగిన పాలతో ఏమేం చేయొచ్చంటే..
  • విరిగిన పాలతో టేస్టీ కోవా

ఎంత జాగ్రత్తగా కాచినా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. ఆ విరిగిన పాలని పారబోయాలంటే మనసొప్పదు చాలామందికి. అలాంటప్పుడు  వాటితో ఈ టేస్టీ అండ్​ ఈజీ కోవా రెసిపీని ట్రై చేయొచ్చు.
కావాల్సినవి
విరిగిన పాలు– ఒక లీటరు
నిమ్మరసం–  ఒక టీ స్పూన్​
చక్కెర– ముప్పావు కప్పు
తయారీ
విరిగిన పాలను వెడల్పాటి గిన్నెలో పోసి వేడిచేయాలి. పాలు విరిగినప్పటికీ అందులో కొద్దిగా పాల శాతం ఉంటుంది. అవి కూడా పూర్తిగా విరగడానికి నిమ్మరసం కలిపి అరనిమిషం మరిగించాలి. ఆ తర్వాత స్టవ్​ ఆపి, మిశ్రమాన్ని వెడల్పాటి జాలీలోకి తీసుకోవాలి. నీళ్లన్నీ ఒడిసిపోయాక జాలీని నిమిషం పాటు  నీళ్ల ట్యాప్​ కింద పెట్టి , విరిగిన పాలని కడగాలి. దీనివల్ల నిమ్మరసం ఫ్లేవర్​ అంతా పోతుంది. పాల మిశ్రమం పూర్తిగా ఆరాక తిరిగి గిన్నెలో వేసి స్టవ్​ వెలిగించాలి. అందులో టేస్ట్​కి తగ్గట్టు చక్కెర వేసి బాగా కలపాలి.  పాల మిశ్రమం గట్టిపడేవరకు  బాగా కలుపుతూ ఉడికించి (దాదాపుగా ఆరు నిమిషాలు)  స్టవ్​ ఆపాలి.  కొంచెం చల్లారాక పప్పు గుత్తితో మెదపాలి. ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోవా బిళ్లల్లా చుట్టాలి. వీటిని ఫ్రిజ్​లో పెడితే వారం రోజుల వరకు  ఫ్రెష్​గా ఉంటాయి.