హాస్పిటల్‌కి వెళ్తున్నారా ? ఏ వ్యాధికి ఏ డాక్టరుని కలవాలో తెలుసా.. లేదంటే జేబు ఖాళీ..

హాస్పిటల్‌కి వెళ్తున్నారా ? ఏ వ్యాధికి ఏ డాక్టరుని కలవాలో తెలుసా.. లేదంటే జేబు ఖాళీ..

 ఏ ఆరోగ్య సమస్యకు ఏ డాక్టర్‌ని కలవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సరైన డాక్టర్ ని సంప్రదించపోవడం  వల్ల మీ  సమయం, డబ్బు రెండూ వృథా అవుతాయి. అందుకే, మీ సమస్యను బట్టి కరెక్ట్ డాక్టర్‌ని ఈజీగా తెలుసుకోవడానికి ఈ చిన్న గైడ్ మీకు ఉపయోగపడుతుంది.

1. జనరల్ ఫిజీషియన్  
మనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మొదట కలవాల్సింది జనరల్ ఫిజీషియన్‌నే.  సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, మోషన్స్, నీరసం, అలాగే బీపీ,  షుగర్ వంటి సమస్యల చికిత్స కోసం వీరిని  కలవొచ్చు. 

2. డెర్మటాలజిస్ట్ (చర్మ వ్యాధుల నిపుణుడు)
చర్మం, జుట్టు, గోళ్లకు సంబంధించిన సమస్యలను వీరు చూస్తారు. ముఖంపై మొటిమలు, విపరీతంగా జుట్టు రాలడం, చుండ్రు, అలర్జీలు, తామర, గజ్జి, సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు వీరిని కలవాలి. 

3. ఇ.ఎన్.టి స్పెషలిస్ట్ (ENT - చెవి, ముక్కు, గొంతు డాక్టర్)
చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వీరు ప్రత్యేక వైద్యం అందిస్తారు. చెవి నొప్పి, వినికిడి తగ్గడం, ముక్కు దిబ్బడ లేదా సైనస్ సమస్యలు, గొంతు నొప్పి, టాన్సిల్స్, తరచుగా ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలకు వీరిని కలవాలి .

4. కార్డియాలజిస్ట్ (గుండె నిపుణుడు)
గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులకు వీరు చికిత్స చేస్తారు. ఛాతీ నొప్పి, గుండె సంబంధిత సమస్యలు, నడిచినప్పుడు ఆయాసం రావడం, తీవ్రమైన బీపీ, గుండె జబ్బులు ఉన్నప్పుడు వీరిని కలవాలి. 

5. ఆర్థోపెడిక్ డాక్టర్ (ఎముకల నిపుణుడు)
ఎముకలు, కీళ్లు, కండరాలు, నరాల నొప్పులకు వీరు చికిత్స అందిస్తారు. కీళ్ల నొప్పులు (మోకాళ్ల నొప్పులు), తీవ్రమైన వెన్నునొప్పి, ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), కీళ్లవాతం, ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాలకి వీరిని కలవాలి.  

6. గైనకాలజిస్ట్ (మహిళల ఆరోగ్య నిపుణురాలు)
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ, గర్భధారణ సమస్యలను వీరు చూస్తారు.  పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం (క్రమరహిత రుతుక్రమం), పిసిఓడి (PCOS) సమస్య, ప్రెగ్నెన్సీ కేర్, పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, సంతానలేమి సమస్యలకి వీరిని కలవాలి. 

7. పీడియాట్రీషియన్ (పిల్లల డాక్టర్)
పుట్టిన పిల్లల నుండి చిన్న పిల్లల ఆరోగ్య బాధ్యతలను వీరు చూసుకుంటారు. పిల్లల్లో జ్వరం, వాంతులు, మోషన్స్, వారికి వేయాల్సిన టీకాలు (Vaccinations), ఎదుగుదల లోపాలు, చిన్న పిల్లల పోషకాహార సమస్యలకి వీరిని కలవాలి.  

8. న్యూరాలజిస్ట్ (మెదడు, నరాల నిపుణుడు)
మెదడు, వెన్నుపాము, నరాల రుగ్మతలకు వీరు చికిత్స చేస్తారు. తరచుగా వచ్చే మైగ్రేన్ తలనొప్పి, ఫిట్స్ (మూర్ఛలు), పక్షవాతం (స్ట్రోక్), చేతులు-కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, మతిమరుపు సమస్యలకి వీరిని కలవాలి. .

 

►ALSO READ | జర భద్రం! వాన చినుకులతో పాటు వచ్చే ఆ 7 రోగాలు ఇవే.. డాక్టర్ల హెచ్చరిక!

 

9. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (జీర్ణకోశ నిపుణుడు)
కడుపు, పేగులు, లివర్ (కాలేయం) సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. కడుపులో మంట (యాసిడ్ రిఫ్లక్స్), అల్సర్లు, దీర్ఘకాలిక కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, లివర్ జబ్బులకి వీరిని  కలవాలి. 

10. ఆప్తాల్మాలజిస్ట్ (కంటి డాక్టర్)
కంటి చూపు, కంటి వ్యాధులకు వీరు చికిత్స చేస్తారు. చూపు మసకబారడం, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం, గ్లాకోమా, కంటికి తగిలే గాయాలకి వీరిని కలవాలి. 

11. సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణుడు)
మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి, మందుల ద్వారా నయం చేస్తారు. తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు, విపరీతమైన ఒత్తిడి, ప్రవర్తనలో మార్పులకి వీరిని కలవాలి.  

12. యూరాలజిస్ట్ 
స్త్రీ, పురుషులలో మూత్రనాళ సమస్యలను, అలాగే పురుషుల పునరుత్పత్తి సమస్యలను వీరు చూస్తారు. కిడ్నీలో రాళ్లు, మూత్రంలో మంట లేదా ఇన్ఫెక్షన్, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, పురుషులలో వంధ్యత్వంకి వీరిని కలవాలి.

ఏ డాక్టర్‌ని కలవాలో అర్థం కాకపోతే ఏం చేయాలి?
మీకు ఉన్న సమస్య ఏంటో, ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో అస్సలు అర్థం కానప్పుడు... ముందుగా ఒక 'జనరల్ ఫిజీషియన్' ని కలవండి. ఆయన మిమ్మల్ని ప్రాథమికంగా పరీక్షించి, సమస్య తీవ్రతను బట్టి ఏ స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవాలో సలహా ఇస్తారు. దీనివల్ల మీ సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో సరైన డాక్టర్‌ను సంప్రదించడం వల్ల పెద్ద పెద్ద జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.