ప్రభుత్వ అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్స్ ఎందుకు తీయరో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే !

ప్రభుత్వ అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్స్ ఎందుకు తీయరో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే !

ప్రభుత్వ ఆఫీసుల్లో  పెద్ద పెద్ద అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్స్ వేసి ఉండటం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎన్నో లగ్జరీ కుర్చీలు వచ్చినా, ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారో తెలుసా...  మీరు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ లేదా మరేదైనా ప్రభుత్వ ఆఫీసుకి వెళ్లినప్పుడు గమనించే ఉంటారు. అక్కడి పెద్ద అధికారి కూర్చునే కుర్చీకి ఒక తెల్లటి టవల్ కప్పి ఉంటుంది. చూసేందుకు చాలా సాధారణంగా అనిపించినా, దీని వెనుక బ్రిటిష్ కాలం నాటి ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

 బ్రిటిష్ కాలం నాటి అలవాటు
నిజానికి, కుర్చీలపై తెల్లటి టవల్స్ వేసే ఈ అలవాటు బ్రిటిష్ వారి కాలంలోనే మొదలైంది. ఆ రోజుల్లో ఇప్పటిలాంటి తారు రోడ్లు, కార్లు ఉండేవి కావు. బ్రిటిష్ అధికారులు గుర్రాల మీద ఎక్కి దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు. అలా ప్రయాణించేటప్పుడు దుమ్ము, ధూళి, చెమట వల్ల వారి బట్టలు మురికిగా మారేవి. అందుకని, ఒంటిని, చేతులను తుడుచుకోవడానికి వారు ఎప్పుడూ ఒక తెల్లటి టవల్‌ను వారితో ఉంచుకునేవారు. మెల్లగా ఆ టవల్ వారి దుస్తుల్లో, ఒక అధికారిక గుర్తింపులో భాగమైపోయింది.

 ఎండ తీవ్రత, చెమట నుండి ఉపశమనం
గతంలో ఇప్పటిలాగా ఆఫీసుల్లో ACలు  ఉండేవి కావు. 1980 వరకు కేవలం ఫ్యాన్లు మాత్రమే ఉండేవి. ఎండాకాలంలో ఆ ఫ్యాన్లు కూడా వేడి గాలిని ఇచ్చేవి. అధికారులు ఆఫీసు కుర్చీల్లో లేదా అంబాసిడర్ కార్లలో కూర్చున్నప్పుడు చెమట వల్ల వారి విలువైన బట్టలు పాడవకుండా ఈ తెల్లటి టవల్స్ కాపాడేవి. ఇంకా చెమటను పీల్చుకోవడానికి, కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ఉండటానికి ఈ టవల్స్ బాగా ఉపయోగపడేవి. 1990 మధ్య వరకు ఇది అధికారుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది.

 ఏసీలు వచ్చినా మారని అలవాటు
ప్రస్తుత కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలు వచ్చేశాయి. కాబట్టి చెమట పట్టే సమస్య గానీ, బట్టలు మురికి అయ్యే అవకాశం గానీ ఇప్పుడు లేదు. అయినసరే  ఆఫీసుల్లో అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్స్ వేసే పద్ధతి మాత్రం  మారలేదు.

 హోదా, అధికారానికి చిహ్నం 
ఇప్పుడు ఈ తెల్లటి టవల్ అనేది కేవలం చెమట తుడుచుకునే బట్ట కాదు, అదొక అధికార చిహ్నంగా మారిపోయింది. ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని పద్ధతులు హోదాను చూపిస్తాయి. ఉదాహరణకు గ్రీన్ పెన్ తో సంతకం చేసే హక్కు ఉండటం, హోదాను బట్టి ఆఫీస్ రూమ్ సైజు, టేబుల్ సైజు మారడం, తలుపు దగ్గర అటెండర్ ఉండటం... అదేవిధంగా, కుర్చీపై ఉండే ఆ తెల్లటి టవల్  ఒక పెద్ద అధికారి అని ఎదుటివారికి చెప్పకనే చెప్పే ఒక అధికారిక గుర్తింపుగా మారిపోయింది. అందుకే పాత కాలం నాటి ఈ అలవాటు ఇప్పటికి కొనసాగుతోంది.