కాకులు మనుషులకు గిఫ్ట్స్ ఇస్తాయా.. ? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి.. ?

కాకులు మనుషులకు గిఫ్ట్స్ ఇస్తాయా.. ? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి.. ?

ఇది చాలామంది జీవితాల్లో వింతగా.. అకస్మాత్తుగా మొదలవుతుంది. మీరు మీ ఇంటి అరుగు మీదో, బాల్కనీలోనో కొన్ని రోజులుగా కాకులకు అన్నం పెడుతున్నారు అనుకుందాం. ఒకరోజు ఉదయం చూసేసరికి, ఆ ఖాళీ గిన్నె పక్కన ఒక చిన్న గులకరాయి, మెరిసే సీసా మూత లేదా ఒక షర్ట్ బటన్ కనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది..? "అబ్బా.. రోజు అన్నం పెడుతున్నందుకు ఈ పక్షి నాకు థాంక్స్ చెబుతూ గిఫ్ట్ ఇచ్చింది" అని చాలా పర్సనల్‌గా ఫీలవుతారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇలాంటి వింత అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇది చూడటానికి ఏదో మ్యాజిక్‌లా అనిపించిన.. దీని వెనుక కాకుల తెలివితేటలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 పక్షుల్లోనే అత్యంత తెలివైంది
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. పక్షి జాతులలో 'కార్విడ్' (Corvid) కుటుంబానికి చెందిన కాకులు అత్యంత తెలివైనవి. ఇవి చిక్కుముడులను  విప్పగలవు, చిన్న చిన్న కర్రలను పరికరాలుగా వాడగలవు, భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోగలవు. వీటన్నిటికంటే ముఖ్యంగా మనుషుల ప్రవర్తనను బాగా గుర్తుంచుకోగలవు. అమెరికాకు చెందిన ఒక సైన్స్ రీసెర్చ్ ప్రకారం.. కాకులు మనుషుల ముఖాలను స్పష్టంగా గుర్తుపట్టగలవు. సంవత్సరాలైన మర్చిపోవు.

 పరిశోధకులు కొన్ని ప్రత్యేకమైన మాస్కులు వేసుకుని కాకులను ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత చాలా కాలం వరకు, ఎప్పుడు ఆ మాస్కులు వేసుకుని బయటకు వచ్చినా కాకులు వాటిని గుర్తుపట్టి అరవడం, దాడి చేయడం చేశాయి. దీన్నిబట్టి వాటికీ మేలు చేసే మనుషులు ఎవరు, కీడు చేసే మనుషులు ఎవరు అనేది కాకులు క్లియర్ గా గుర్తుపెట్టుకుంటాయని రుజువైంది.

నిజంగానే 'బహుమతులు' ఇస్తాయా 
శాస్త్రవేత్తలు దీనికి 'కృతజ్ఞత' లేదా 'థాంక్స్ చెప్పడం' అనే పదాలను నేరుగా వాడరు. ఎందుకంటే మనుషులకు ఉన్నట్లుగా కాకులకు సెంటిమెంట్స్ ఉంటాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ జంతు ప్రవర్తన నిపుణులు దీనికి ఒక ప్రాక్టికల్ కారణాన్ని చెబుతున్నారు. అదే ఇచ్చిపుచ్చుకునే అలవాటు. కాకులకు మెరిసేవి, వింతగా ఉండేవి లేదా నోటితో సులభంగా పట్టుకోగలిగే వస్తువులను సేకరించడం ఒక సరదా. ఒక కాకి అలాంటి ఏదైనా వస్తువును నోటకరచుకుని ఎగురుతూ, తనకు రోజు ఆహారం దొరికే చోట వాలినప్పుడు, పొరపాటున దాన్ని అక్కడ పడేయవచ్చు.

అలా పడేసిన తర్వాత దానికి అక్కడ మంచి ఆహారం దొరికినా, లేదా మనిషి దాన్ని చూసి మురిసిపోయినా.. కాకి ఆ ప్రవర్తనను అలవాటుగా మార్చుకుంటుంది. "ఇక్కడ ఈ వస్తువు పెడితే నాకు ఫుడ్ దొరుకుతుంది" అని అది ఫిక్స్ అయిపోతుంది. ఒక కాకి ఇలా చేయడం చూసి, ఆ గుంపులోని మిగతా కాకులు కూడా దాన్ని చూసి నేర్చుకుంటాయి.

కాకులు తెచ్చే వస్తువులు  
కాకులు తెచ్చే వస్తువులను గమనిస్తే.. అవి ఎక్కువగా గులకరాళ్లు, గాజు ముక్కలు, కాయిన్స్, సీసా మూతలు లేదా ఉంగరాలు అయివుంటాయి. ఇవి చాలా కాలం మన్నేవి, చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవి. అందుకే కాకులు అన్వేషణలో ఉన్నప్పుడు ఇవి వాటి కంటికి త్వరగా చిక్కుతాయి. వీటిని మోయడం, దాచడం కూడా వాటికి చాలా ఈజీ.

 ఈ ప్రవర్తన   ఏం చెబుతోంది
మనం దీన్ని 'కృతజ్ఞత' అని పిలవకపోయినా.. ఈ చిన్న విషయం ఒక అద్భుతాన్ని బయటపెడుతోంది. కాకులు మనుషులను నిశితంగా గమనిస్తాయి, పాత విషయాలను గుర్తుంచుకుంటాయి, దానికి తగినట్లుగా వాటికీ అవి మార్చుకుంటాయి. నగరాల్లో మనతో పాటు బ్రతుకుతున్న జీవుల్లో ఇవి ఎంత ప్రత్యేకమైనవో దీని ద్వారా అర్థమవుతుంది.

మనుషులకు, జంతువులకు మధ్య దూరం పెరుగుతున్న ఈ రోజుల్లో.. ఈ చిన్నపాటి 'ఇచ్చిపుచ్చుకోవడాలు' మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తాయి. తెలివితేటలు అనేవి కేవలం మనుషుల సొంతం కాదు.. మనం చూపించే కాస్త ప్రేమ మూగజీవుల ప్రవర్తనను కూడా మార్చగలదు.