80 ఏళ్ల వయసులో కూడా కొందరి మెదడు ఎంతో చురుగ్గా ఉండటం వెనుక ఉన్న రహస్యాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం, అయోమయం వంటి సమస్యలు వస్తాయి. కానీ సూపర్-ఏజర్స్ (Super-Agers) అని పిలిచే కొందరు వ్యక్తులు మాత్రం 80 ఏళ్లు దాటినా యువకుల మెదడులాగే పదునైన తెలివితేటలతో ఉంటారు.
వీరి గురించి చేసిన ఒక అధ్యయనంలోని కొన్ని విషయాలు చూస్తే... సూపర్-ఏజర్స్ అంటే 80 ఏళ్లు దాటిన కూడా 50 లేదా 60 ఏళ్ల వారిలాగే అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం ఉన్నవారిని సూపర్-ఏజర్స్ అంటారు. చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీరి మెదడు పనితీరుపై ఓ పరిశోధన చేశారు. మెదడు చురుగ్గా ఉండటానికి చేసిన ఈ పరిశోధనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం న్యూరోజెనిసిస్. అంటే మెదడులో కొత్త నాడులు పుట్టే ప్రక్రియ. సాధారణంగా ఈ ప్రక్రియ శిశువు గర్భంలో ఉన్నప్పుడు వేగంగా జరుగుతుంది. కానీ సూపర్-ఏజర్ల మెదడులో, ముఖ్యంగా జ్ఞాపకశక్తికి కేంద్రమైన 'హిప్పోకాంపస్' ప్రాంతంలో కొత్త కణాలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉన్నాయి. వీరి మెదడులో కొత్తగా పుట్టిన కణాలు ఎక్కువగా ఉండటం వల్ల వారి మెదడు ఎప్పుడూ హుషారుగా, చురుగ్గా ఉంటోంది.
పరిశోధన ఎలా జరిగిందంటే:
శాస్త్రవేత్తలు మరణించిన 38 మంది వృద్ధుల మెదళ్లను పరిశీలించారు. వారిలో మూలకణాలు ఎంత చురుగ్గా ఉన్నాయో గమనించారు. సూపర్-ఏజర్ల మెదడులో ఈ కణాలు విభజన చెంది, కొత్త కణాలుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇది వారి మెదడు వయసుతో సంబంధం లేకుండా పనిచేయడానికి సహాయపడుతోంది.
కేవలం కొత్త కణాలు ఉండటమే కాదు, ఆ కణాలను కాపాడే ఒక రకమైన జన్యు ప్రోగ్రామింగ్ కూడా వీరిలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల వయసు వల్ల వచ్చే మార్పులను వీరి మెదడు తట్టుకోగలుగుతోంది.గతంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం, సూపర్-ఏజర్లు కొన్ని అలవాట్లతో ఉంటారు. అంటే ఆరోగ్యకరమైన జీవనం పాటించడం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ మెదడుకు పని చెప్పడం, సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండటం. ఈ సూపర్-ఏజర్ల రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులను అరికట్టడానికి కొత్త మార్గాలు దొరుకుతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
