షాద్నగర్: కేవలం రూ.20 వేల అప్పు వివాదం ఓ సెక్యూరిటీ గార్డు హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.
షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం తీగాపూర్ శివారులోని ఓ వెంచర్లో ఈ నెల 14న సెక్యూరిటీ గార్డు ప్రేమ్కుమార్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో ఇర్ఫాన్, నవాజుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రూ.20 వేల అప్పు విషయంలో జరిగిన వాగ్వాదం హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. అప్పు విషయంలో వివాదం ముదరడంతో నిందితులు కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన కొత్తూరు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
