వీడియో కాల్‌లో పెండ్లి ప్ర‌పోజ‌ల్: అమ్మాయి ఒప్పుకోలేద‌ని ఆత్మ‌హ‌త్య‌

వీడియో కాల్‌లో పెండ్లి ప్ర‌పోజ‌ల్: అమ్మాయి ఒప్పుకోలేద‌ని ఆత్మ‌హ‌త్య‌

ప్రేమించిన అమ్మాయి పెండ్లికి ఒప్పుకోలేద‌ని 19 ఏండ్ల యువ‌కుడు త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అమ్మాయికి వీడియో కాల్‌లో ప్ర‌పోజ్ చేసిన అత‌డు.. ఆ యువ‌తి కాద‌న‌డంతో వెంట‌నే క్ష‌ణికావేశంలో త‌న బెల్టు తీసి ఊరివేసుకుని ప్రాణం వ‌దిలాడు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ముంబైలోని కుర్లా ఏరియాలో ఉన్న భార‌తీయ న‌గ‌ర్‌కు చెందిన 19 ఏండ్ల‌ యువ‌కుడు త‌న‌తో పాటు చ‌దువుకునే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె స‌న్నిహితంగా ఉంటుండ‌డంతో ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తోంద‌ని అనుకున్నాడు. దీంతో ఆదివారం ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ పెండ్లి చేసుకుందామ‌ని ప్ర‌పోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఆ యువ‌కుడు బెల్టుతో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఇంట్లో అత‌డి త‌ల్లిదండ్రులు లేరు. ఎన్ని సార్లు కాల్ చేసినా ఆ యువ‌కుడు  ఫోన్ ఎత్త‌క‌పోవ‌డంతో అత‌డి త‌ల్లి ప‌క్క  ఇంట్లో వాళ్ల‌కు ఫోన్ చేసి చూడ‌మ‌ని కోరింది. వాళ్లు వెళ్లి చూడ‌గా అత‌డు మ‌ర‌ణించి ఉండ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో వీబీ న‌గ‌ర్ పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే అత‌డు ఉరేసుకునే ముందు కూడా ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి తాను చ‌నిపోతున్నాన‌ని చెప్పిన‌ట్టు త‌మ ఎంక్వైరీలో తేలింద‌ని పోలీసులు తెలిపారు.