హైదరాబాద్: నల్గొండ జిల్లా పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతేకాకుండా, ఈ చారిత్రక ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు.
ప్రాచీన శిల్పకళకు అద్భుత నిదర్శనం
తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ఛాయా సోమేశ్వరాలయం ప్రతీకగా నిలుస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.. వందల ఏళ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాలను సమన్వయం చేసి శివలింగంపై నిరంతరం ఛాయ కనిపించేలా ఆలయాన్ని నిర్మించడం విశేషమని అన్నారు. ప్రాచీన భారతీయ నిర్మాణ విజ్ఞానానికి, తెలంగాణ శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం అద్భుత ఉదాహరణగా నిలుస్తోందని వివరించారు.
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఛాయా సోమేశ్వరాలయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.
సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు
ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించడంతో పాటు వాటికి పర్యాటక ప్రాధాన్యం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంపై భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తయితే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా పర్యాటక రంగానికి ఊతం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
