సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు అసలైన బాక్సాఫీస్ వార్. పండగ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్, భారీ ఓపెనింగ్స్‌పై నమ్మకంతో స్టార్ హీరోల సినిమాలు ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటాయి. అయితే 2027 సంక్రాంతి మాత్రం ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు పండక్కి బెర్తులు ఖరారు చేసుకుంటున్నాయి. కానీ ఈ రేసులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక ట్విస్ట్ మాత్రం నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడమే..
సంక్రాంతి నుంచి బాలయ్య ఔట్..
బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. 'వీరసింహారెడ్డి'తర్వాత వీరిద్దరి కలయిక కావడంతో హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం గాయం కారణంగా బాలయ్య విశ్రాంతిలో ఉండగా, త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 24, 2026న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంటే సంక్రాంతి పోరుకు ముందే బాలయ్య బరిలోకి దిగే అవకాశమే ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ' అఖండ 2' మూవీని కూడా 2026 సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే ( డిసెంబర్ 12, 2025) రిలీజ్ చేశారు.
ఇప్పుడు కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుని .. దాని కంటే ముందే డిసెంబర్ లో బాలయ్య మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబయి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
రేసులో టాప్ మూవీస్ ఇవే..
ఇక సంక్రాంతి రేసులో 'జనవరి 12 విడుదల' పేరుతోనే పండగ డేట్‌ను ప్రకటించిన వెంకటేష్–కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లోని 'కాకా' జనవరి 13న విడుదల కానుంది. 'మెగా158'’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ఇటీవల టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఇక సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు' జనవరి 12న, శర్వానంద్–శ్రీను వైట్ల 'జార్జ్ క్రిష్' జనవరి 14న రేసులో ఉన్నాయి. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి కొన్ని చిత్రాలు కూడా సిద్ధం అవుతున్నాయి.
అంటే బాలయ్య తప్పుకోవడంతో పోటీ తగ్గిందనుకుంటే పొరపాటే..ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్, చిరంజీవి, సాయి దుర్గా తేజ్, శర్వానంద్ సినిమాలతో సంక్రాంతి బరిలో గట్టి పోటీ కనిపిస్తోంది. థియేటర్ల కేటాయింపు నుంచి ఓపెనింగ్స్ వరకు ప్రతి అంశం కీలకం కానుంది. మరి ఈ మెగా రేసులో సంక్రాంతి విన్నర్ ఎవరు? బాలయ్య ముందే బాక్సాఫీస్‌ను షేక్ చేసి వెళ్తారా? లేక పండగ సినిమాలే అసలు సంక్రాంతి కింగ్‌ను నిర్ణయిస్తాయా? సమాధానం కోసం 2027 జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే..
