కార్పొరేట్ కొలువులో లక్షలు సంపాదించిన యువకుడు.. సడెన్‌గా ఉద్యోగం పోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. నెలల తరబడి జాబ్ కోసం ఆశగా 200 ఇంటర్వ్యూలకు తిరిగినా నిరాశే ఎదురుకావడంతో విసిగిపోయాడు. దీంతో డబ్బుల కోసం కాకుండా మానసిక ప్రశాంతత కోసం ఏకంగా రెస్టారెంట్‌లో అంట్లు తోమే పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరాడు. గంటకు రూ.1,000 సంపాదిస్తున్న ఈ 29 ఏళ్ల కార్పొరేట్ ఉద్యోగి స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
లేఆఫ్ దెబ్బతో నిరుద్యోగ ప్రయాణం..
అమెరికాలో కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న 29 ఏళ్ల యువకుడు గత ఏప్రిల్ నెలలో అనూహ్యంగా లేఆఫ్ దెబ్బతో రోడ్డున పడ్డాడు. కంపెనీ అతనికి 9 నెలల పాటు మంచి సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ.. నిరుద్యోగ భృతి కూడా అందుతున్నప్పటికీ అతడిలో ఆందోళన మొదలైంది. కొత్త ఉద్యోగం కోసం ఏకంగా 200లకు పైగా దరఖాస్తులు పెట్టుకుని.. 15కు పైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ ఏ ఒక్కచోటా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ప్రతిరోజూ ఖాళీగా ఉండటం.. ఎలాంటి దినచర్య లేకపోవడం వల్ల అతని మానసిక ఆరోగ్యం దెబ్బతినడం స్టార్ట్ అయ్యిందట.
డబ్బుల కోసం కాదు.. మానసిక ప్రశాంతత కోసం..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతనికి ఆర్థిక ఇబ్బందులు లేవు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తంతో రాబోయే 5 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకగలడట. అయినప్పటికీ చేయటానికి పనిలేకపోతే క్రమశిక్షణ కోల్పోవడం, సమాజంలో పనీపాట లేకుండా బతుకుతున్నాననే భావన అతన్ని కుంగదీశాయని చెప్పాడు. రోజువారీ జీవితానికి ఒక పద్ధతి తెచ్చుకోవడానికి, మెదడుకు కాస్త విశ్రాంతినివ్వడానికి తాను ఎప్పుడూ ఊహించని విధంగా గంటకు 11 డాలర్లు ఇచ్చే డిష్ వాషింగ్ పార్ట్ టైమ్ జాబ్‌లో చేరాడట.
అంట్లు తోముతూ కాలక్షేపం..
కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత తన అనుభవాలను అతడు రెడిట్ వేదికగా 'r/Layoffs' గ్రూప్‌లో పంచుకున్నాడు ఆ కుర్రోడు. తాను ఈ పని డబ్బుల కోసం చేయడం లేదు.. దినచర్యకు ఒక క్రమశిక్షణ రావడానికి, ఉపయోగకరంగా భావించడానికి ఇది చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ చిన్న పనైనా సరే నా ఆందోళనను తగ్గిస్తుందని ఆశిస్తున్నానని రాసుకొచ్చాడు. గంటకు రూ. 1000 సంపాదిస్తూ కష్టపడి పనిచేస్తున్న ఈ యువకుడి పోస్ట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
నెటిజన్ల సపోర్ట్..
ఈ విభిన్నమైన ప్రయాణాన్ని పంచుకున్న యువకుడికి సోషల్ మీడియాలో భారీ సపోర్ట్ లభిస్తోంది. చిన్న ఉద్యోగంలోనూ ఎంతో గౌరవం ఉంటుందని.. లేఆఫ్ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది ఒక మంచి థెరపీ లాంటిదని కొందరు నెటిజన్లు అభినందించారు. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పని చేసి ఒక్కసారిగా ఖాళీగా ఉండిపోతే వచ్చే మానసిక వేదనను ఈ యువకుడు ఎదుర్కొన్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మెుత్తానికి మనకోసం మనం చేసే ఏ పనైనా తక్కువ కాదని, చేసే పనిపై శ్రద్ద ఇష్టం ఉంటే చాలని ఈ కుర్రోడి జర్నీ సూచిస్తోంది.
