చెక్క ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా ? రూపాయి ఖర్చు లేకుండా ఈ ట్రిక్స్‌తో గుడ్ బై చెప్పండి!

చెక్క ఫర్నిచర్‌కు చెదలు పట్టాయా ? రూపాయి ఖర్చు లేకుండా ఈ ట్రిక్స్‌తో గుడ్ బై చెప్పండి!

చెక్క ఫర్నిచర్‌కు చెదలు పట్టడం అనేది చాలా మంది ఎదుర్కొనే ఓ సాధారణ సమస్య. చెదలు పట్టినప్పుడు అవి బయటకు కనిపించవు. కానీ ఫర్నిచర్ కింద చెక్క పొడి రాలడం, లోపల చెదల శబ్దాలు రావడం, చిన్న పగుళ్లు ఏర్పడటం వంటివి చెదలు పట్టినట్లు చెప్పే మొదటి సంకేతాలు... 

అయితే ఈ సమస్య పెద్దగా ఉన్నప్పుడు కెమికల్స్ వాడాల్సిందే, కానీ మొదట్లోనే  గుర్తిస్తే కొన్ని సులువైన ఇంటి చిట్కాలతో చెదలను వదిలించుకోవచ్చు. అందుకు 6 సులభమైన చిట్కాలు ఇవే:

1. వేప నూనె  
చెదలు ఉన్నట్లు అనుమానం ఉన్న చిన్న చిన్న మచ్చలు, పగుళ్లు, ఫర్నిచర్ కీళ్ల వద్ద వేప నూనెను రాయాలి. ముఖ్యంగా ఫర్నిచర్ కింద, ఎవరికీ కనపడని మూలల్లో బ్రష్‌తో ఈ నూనెను పూయాలి. వేప నూనె  చెదలను వెంటనే చంపకపోయినా, చెక్కపై ఒక చేదు పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల చెదల పురుగులు ఆహారం తీసుకోలేక, వాటి ఎదుగుదల ఆగిపోతుంది. ఒకేసారి ఎక్కువగా పూయడం కంటే, ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పలచగా.. తరచుగా పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. ఎండలో పెట్టడం
చీకటి, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో చెదలు చాలా వేగంగా పెరుగుతాయి. అందువల్ల చెదలు పట్టిన చిన్న చిన్న స్టూల్స్, టేబుల్స్, లేదా డ్రాయర్లను కొన్ని గంటల పాటు బాగా ఎండ తగిలేలా బయట ఉంచాలి. ఎండ వేడి వల్ల చెక్కలో ఉన్న తేమ పూర్తిగా ఆరిపోతుంది. వేడి, పొడి వాతావరణాన్ని తట్టుకోలేక చెదలు చనిపోతాయి లేదా పారిపోతాయి. బయటకు తీసుకెళ్లలేని పెద్ద పెద్ద చెక్క అల్మారాలను ఇంట్లోనే గాలి, వెలుతురు బాగా వచ్చేలా కిటికీల దగ్గర పెట్టుకోవాలి.

3. వెనిగర్ - నిమ్మరసం 
తెల్ల వెనిగర్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. చెదలు పట్టిన చిన్న రంధ్రాలు, సన్నని సందులలోకి ఈ ద్రవాన్ని స్ప్రే చేయాలి లేదా డ్రాపర్ సహాయంతో లోపలికి పంపాలి. వెనిగర్‌లోని ఘాటైన ఆమ్ల గుణం చెదల  పురుగులను చంపేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఫర్నిచర్ పైభాగంలో పోయకుండా, కేవలం పగుళ్లలోనే వేయాలి.  

4. ఉప్పు నీళ్లు  
నేల నుండి లేదా గోడల నుండి చెదలు ఫర్నిచర్‌కు పాకకుండా ఉండటానికి, ఫర్నిచర్ కాళ్ల చుట్టూ ఇంకా  కింద ఉన్న అంచుల దగ్గర  ఉప్పు ఉపయోగించవచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉప్పును కరిగించి, ఆ నీటిని పగుళ్లలో పోయవచ్చు లేదా పొడి ఉప్పును అక్కడ చల్లవచ్చు. ఉప్పు ఉన్న చోట తేమ తగ్గిపోతుంది. తేమ లేని పొడి వాతావరణంలో చెదలు బతకలేవు.

5. లవంగ నూనె 
లవంగ నూనె లాంటి ఘాటైన వాసన గల నూనెలను దూది సహాయంతో క్యాబినెట్ కీళ్ళు, డ్రాయర్ అంచులు, చెక్క అతుకుల వద్ద పూయాలి. లవంగ నూనెలోని బలమైన ఘాటు వాసన చెదల పురుగులకు అస్సలు పడదు. లవంగ నూనె  చెక్క లోపల వాటి కదలికలను అడ్డుకుంటుంది.

6. తేమను తగ్గించడం  
ఇంట్లో చెదలు పట్టడానికి అసలు కారణం తేమ. తడి గోడలు, లీక్ అవుతున్న పైపులు, గాలి ఆడని మూలల్లో ఉన్న ఫర్నిచర్‌కు చెదలు త్వరగా పడతాయి. ఫర్నిచర్ పై నీళ్లు పడితే వెంటనే తుడవాలి. చెక్క అల్మారాలను గోడకు పూర్తిగా ఆనించకుండా కొద్దిగా దూరం జరిపి ఉంచాలి. దీనివల్ల గాలి బాగా ఆడుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చిట్కాలు కేవలం మొదటి  దశలో ఉన్న చెదలను పెరగకుండా కంట్రోల్  చేయడానికి మాత్రమే పనికివస్తాయి. ఒకవేళ ఫర్నిచర్ లోపలి భాగం పూర్తిగా దెబ్బతిని, చెదలు ఎక్కువగా వ్యాపిస్తే మాత్రం వెంటనే పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించడం మంచిది.