ఆలుగడ్డ తొక్కలను పారేస్తున్నారా ? వీటితో మొక్కలు ఆరోగ్యంగా పెంచడానికి 6 అద్భుతమైన చిట్కాలు..

 ఆలుగడ్డ తొక్కలను పారేస్తున్నారా ? వీటితో మొక్కలు ఆరోగ్యంగా పెంచడానికి 6 అద్భుతమైన చిట్కాలు..

సాధారణంగా మనం బంగాళాదుంప తొక్కలను పారేస్తుంటాం. కానీ, తోటపని నిపుణులు, మట్టి సూక్ష్మజీవ శాస్త్రవేత్తల ప్రకారం, వీటిని పారేయడం అంటే డబ్బును వృధా చేసుకోవడమే. అయితే  బంగాళాదుంప తొక్కలను పులా కుండీలలో, పెరట్లోని మొక్కలకి, ఇంట్లోని చెట్లకు  ఎలా ఉపయోగించవచ్చో చూద్దామా... 

మీ ఇంట్లోని  మొక్కలను బలంగా, ఆరోగ్యంగా పెంచడానికి, వంటగదిలోని చెత్తను తగ్గించడానికి బంగాళాదుంప తొక్కలను 6 అద్భుతమైన మార్గాలలో ఉపయోగించవచ్చు. 

1. వానపాములకు ఆహారంగా  
మీరు ఇంట్లో వానపాముల ఎరువు (వర్మీకంపోస్ట్) తయారు చేస్తుంటే, ఈ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. వానపాములు బంగాళాదుంప తొక్కలను తిని, వాటిని పోషకాలతో మంచి ఎరువుగా మారుస్తాయి. ఈ ఎరువును తోటలోని మొక్కల మొదట్లో చల్లితే మట్టి సారవంతం అవుతుంది. చిన్న వానపాముల తొట్టిలో వీటిని వేసేటప్పుడు, తొక్కలను ముందుగా ఉడకబెట్టి వేయడం మంచిది. లేదంటే మట్టిలోని తేమను పీల్చుకుని తొక్కల నుంచే కొత్త మొక్కలు మొలవడం మొదలవుతాయి. ఉడకబెట్టడం వల్ల వానపాములు కూడా వీటిని తేలికగా తింటాయి.

2. బూజు తెగుళ్ల నివారణకు 
మొక్కలకు బూజు తెగులు సోకినప్పుడు బంగాళాదుంప తొక్కలు మంచి మందుగా పనిచేస్తాయి. బంగాళాదుంపలలో ‘సోలనిన్’ అనే పదార్థం ఉంటుంది. తొక్కలను నీళ్లలో బాగా ఉడకబెట్టడం ద్వారా ఈ సోలనిన్‌ను వేరు చేయవచ్చు. ఆ నీటిని చల్లార్చి, మొక్కలపై చల్లడం ద్వారా బూజు తెగుళ్లను తగ్గించవచ్చు. ఈ పద్ధతి పూర్తిగా సహజమైనది ఇంకా సేంద్రీయమైనది.

3. మొక్కల కింద పాతిపెట్టడం
టమోటాలు, మొక్కజొన్న, క్యాబేజీ, గుమ్మడికాయ వంటి పంటలకు ఎక్కువ పోషకాలు కావాలి. ఇలాంటి మొక్కలను నాటే ముందు మట్టిలో 6 నుండి 8 అంగుళాల లోతులో గుంత తీసి, అందులో బంగాళాదుంప తొక్కలను వేసి పూడ్చేయాలి. ఆ తర్వాత వాటి పైన ఈ మొక్కలను నాటాలి. ఈ తొక్కలు మట్టిలో నెమ్మదిగా కుళ్ళిపోతూ, మొక్కల వేర్లకు కావలసిన పోషకాలను అందిస్తాయి.

4. కంపోస్ట్ ఎరువులో నత్రజని 
ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారు చేసేవారు, అందులో నత్రజని శాతాన్ని పెంచడానికి బంగాళాదుంప తొక్కలను కలపవచ్చు. అయితే, కంపోస్ట్ కుండీలో వేడి తక్కువగా ఉంటే, ఈ తొక్కల నుండి కొత్త మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని, ఇవి మొలకెత్తకుండా ఉండటానికి తొక్కలను వేసిన తర్వాత కంపోస్ట్ మిశ్రమంతో బాగా కప్పి ఉంచాలి.

5. పుట్టగొడుగుల పెంపకానికి 
మీకు ఇంట్లోనే పుట్టగొడుగులు పెంచే అలవాటు ఉంటే, ఈ తొక్కలు చక్కగా పనిచేస్తాయి. బంగాళాదుంప తొక్కలను చిన్న చిన్న చెక్క ముక్కలతో కలిపి, అందులో పుట్టగొడుగుల బీజాలను వేయాలి. ఈ తొక్కలు పుట్టగొడుగులు పెరగడానికి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగుల కోత అయిపోయాక, మిగిలిన ఆ చెక్క ముక్కల మిశ్రమాన్ని తోటలో ఎరువుగా వాడుకోవచ్చు.

6. నత్తలను పట్టుకోవడానికి  
తోటలో మొక్కలను పాడుచేసే నత్తలను పట్టుకోవడానికి బంగాళాదుంప తొక్కలు ఒక వలలా పనిచేస్తాయి. ఒక ఖాళీ కుండీని తీసుకుని, దాని కింద కొన్ని బంగాళాదుంప తొక్కలను పెట్టాలి. కుండీని బోర్లించి నత్తలు లోపలికి వెళ్లడానికి వీలుగా ఒక చిన్న కొమ్మను కుండీ అంచు కింద పెట్టి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. తొక్కలలో ఉండే పిండిపదార్థం కోసం నత్తలు  లోపలికి వెళ్తాయి. ఉదయం ఎండ తగలకుండా నత్తలన్నీ ఆ కుండీ లోపలే దాక్కుంటాయి. అప్పుడు వాటినీ ఈజీగా  తీసి పారేయవచ్చు.