ఫ్రాన్స్‌లో మరోసారి నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పెరుగుతున్న ఖర్చులు, జీతాలు, ప్రభుత్వ సేవలు, పాఠశాలల్లో నిధుల కొరత వంటి అంశాలపై విద్యార్థులు, కార్మికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. గత వారం జరిగిన హింసాత్మక ఘటనలు, దుకాణాల దోపిడీలు, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు సుమారు 70 వేల మంది పోలీసు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది.
లియోన్‌లో టియర్ గ్యాస్ ప్రయోగం
అక్టోబర్ 24, 2026 (శనివారం) పారిస్‌తో పాటు పలు సిటీల్లో నిరసనలు కొనసాగాయి. ఫ్రాన్స్‌లోని మూడో అతిపెద్ద నగరం అయిన లియోన్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు ఆంక్షలు విధించగా, నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం నాటికి దేశవ్యాప్తంగా 135 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు తనిఖీల్లో పటాకులు, ఇతర ప్రమాదకర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పారిస్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు
గత వారం జరిగిన అల్లర్లు, షాపింగ్ మాల్స్ లో దోపిడీ మళ్లీ రిపీట్ కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, వాటర్ క్యానన్లను కూడా సిద్ధం చేశారు.
పారిస్‌లో ప్రధాన నిరసన ర్యాలీ మార్గాన్ని అధికారులు మార్చారు. సిటీకి దూరంగా ర్యాలీని పరిమితం చేశారు. కొన్ని ప్రముఖ మ్యూజియాలను మూసివేశారు. దుకాణదారులు తమ షాపుల అద్దాలకు రక్షణ ఏర్పాటు చేసుకున్నారు.
ఎందుకు ఈ నిరసనలు?
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మెరుగైన విద్యా సదుపాయాలు, వేతనాల పెంపు, పెన్షన్లు, నిత్యావసరాల ధరల భారంపై విద్యార్థులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తొలుత ఒక పాఠశాలలో సిబ్బంది కొరతకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం క్రమంగా దేశవ్యాప్త నిరసనలుగా మారింది.
గత వారం జరిగిన ప్రదర్శనల్లో 5 లక్షల మందికి పైగా పాల్గొన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఆందోళనల సందర్భంగా పలు వ్యాపార సంస్థలు ధ్వంసం కావడం, దుకాణాలు దోపిడీకి గురికావడం, ప్రభుత్వ భవనాలపై దాడులు జరగడంతో ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
రాజకీయంగానూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
దేశంలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో, మరోవైపు మారిన్ లె పెన్‌కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ ఓర్లియాన్స్ సిటీలోలో సమావేశం నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలపై అసంతృప్తి ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు శాంతిభద్రతలను కాపాడటం అధికారులకు సవాలుగా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న క్రమంలో, హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు ఉన్నారు. నిరసనకారుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
