ఫ్లైఓవర్ పై నుంచి కాలువలో మినీ బస్సు బోల్తా.. 8 మంది మృతి.. 15 మందికి గాయాలు

ఫ్లైఓవర్ పై నుంచి కాలువలో మినీ బస్సు బోల్తా.. 8 మంది మృతి.. 15 మందికి గాయాలు

జైపూర్: రాజస్థాన్‏లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సిమాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరాడియా సమీపంలో శనివారం (అక్టోబర్ 17) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు. నిద్రమత్తులో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి ఖాటు శ్యామ్ జీ యాత్ర కోసం మినీ బస్సులో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వంతెన పై నుంచి బస్సు కాలువలో బోల్తా పడింది. 

ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో 16 మంది గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.