అంగన్‌‌వాడీల్లో విద్యుత్ కాంతులు...ఆసిఫాబాద్ జిల్లాలోని 879 కేంద్రాలకు కరెంట్

అంగన్‌‌వాడీల్లో విద్యుత్ కాంతులు...ఆసిఫాబాద్ జిల్లాలోని 879 కేంద్రాలకు కరెంట్
  •     ఫ్యాన్లు, లైట్లు, నీటి సదుపాయాలు
  •     టీవీలో అక్షరాలు, రైమ్స్

ఆసిఫాబాద్, వెలుగు: చిన్నారుల తొలి బడులుగా భావించే అంగన్‌‌వాడీ కేంద్రాల్లో కరెంట్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్రాలకు కొత్త శోభ రానుంది. ఫలితంగా చిన్నారులకు సౌకర్యవంతమైన, ఉల్లాసమైన వాతావరణం ఏర్పడనుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలోని 879 అంగన్‌‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించగా.. శనివారంతో పనులు పూర్తయ్యాయి. దీంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు తదితర పరికరాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.

ఉక్కపోత లేకుండా.. వెలుతురు  ఉండేలా..

అంగన్వాడీల్లో మొదటి నుంచి అరకొర సదుపాయాలే ఉండేవి. అనేక కేంద్రాల్లో విద్యుత్​ కనెక్షన్​ లేక చిన్నారులు ఉక్కపోత, వెలుతురు లేమితో ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో చిన్నారుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్వాడీల్లో కరెంటు సదుపాయం కోసం జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించింది. దీంతో 879 అంగన్వాడీ కేంద్రాలకు తాజాగా విద్యుత్​ సదుపాయం కల్పించారు. ఫలితంగా చిన్నారులు ఫ్యాన్ల గాలిలో చదువుకోవడంతోపాటు, ఆటలాడుకునేందుకు అవకాశం ఉంటుంది.  పోషకాహార పంపిణీతో పాటు చిన్నారుల సంరక్షణకు అవసరమైన సేవలను మరింత మెరుగ్గా అందించనున్నారు. కరెంటు సౌకర్యంతో అంగన్వాడీ టీచర్లు సులభమైన పద్ధతిలో అక్షరాలు నేర్పించనున్నారు. టీవీలోనే రైమ్స్ డిస్ప్లే చేసి నేర్పిస్తునారు. పాటలు రూపంలో అక్షరాలను నేర్పుతూ చిన్నారులకు ఇంట్రెస్ట్ పెంచేలా బోధిస్తున్నారు. చిన్న వయసులోనే డిజిటల్ లెర్నింగ్ అలవాటు పడే అవకాశం ఏర్పడింది.

కరెంట్ లేక ఇబ్బందిగా ఉండేది

గతంలో కరెంట్ లేక ఎండాకాలం ఉక్కుపోత, వానాకాలం చీకట్లో దోమల బెడదతో పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. కరెంట్ కనెక్షన్ తో ఆ కష్టాలు తీరాయి. టీవీలో చిన్నారులు ఆసక్తిగా అక్షరాలు నేర్చుకుంటున్నారు.
– కొడప నేతుబాయి, అంగన్వాడీ టీచర్, మార్లవాయి, జైనూర్ మండలం

బాధ్యతగా భావిస్తున్నాం..

సర్కిల్ పరిధిలోని మొత్తం 879 అంగన్‌‌వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించాం. కరెంట్ ​సౌకర్యంతో చిన్నారుల విద్య, ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాలతో పాటు అంగన్‌‌వాడీ కార్యకర్తలు విధులు సైతం మరింత సమర్థవంతంగా సాగుతాయని భావిస్తున్నాం. ప్రతి అంగన్‌‌వాడీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం అందించేలా చర్యలు చేపడుతున్నాం. – ఉత్తమ్ జాడే, సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆసిఫాబాద్