నాన్నల ఔన్నత్యాన్ని నలుగురికీ చాటిన పుస్తకం

నాన్నల ఔన్నత్యాన్ని నలుగురికీ చాటిన పుస్తకం

‘అమ్మ ఒకవైపు.. దేవతలంతా ఒకవైపు..’ అన్నారు సినారె. ‘అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన’ అన్నాడు సుద్దాల అశోక్ తేజ. అమ్మా నాన్నల ఉత్కృష్టతను ఇంతని చాటి చెప్పేందుకు ఏ ఉపమానాలూ సాటిరావన్నది వారి ఆంతర్యం. 

ఈ దృష్ట్యా గతంలో ‘అమ్మకు ప్రేమతో’ అనే బృహత్ లేఖా సంకలనం వెలువరించిన రచయితే ఈమధ్య ‘మానాన్నగారు’ పేరుతో మరో బృహత్ వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ఇది రచయిత తన ఒక్కడి నాన్న గురించి రాసిన పుస్తకం కాదు. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశిష్టులైన వారిచేత కూడా తమ నాన్నల విశిష్టతను చాటింపు వేయించిన బృహద్గ్రంథం ఈ ‘మానాన్నగారు’ వ్యాసాంజలి. వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా. మడత భాస్కర్ సంపాదకత్వంలో వెలువడిన ఈ గ్రంథం ఎందరో పుత్రరత్నాలకు మార్గదర్శనం ఎట్లా కాగలదో, అట్లే ఎంతోమంది కొడుకులకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది అనడం కూడా సత్యమే. 

అమ్మ ప్రేమను గొప్పగా చిత్రిస్తూ అనేకంగా పుస్తకాలు వచ్చిన తరుణంలో నాన్న గొప్పతనాన్ని, నాన్న విశిష్టతను, నాన్న త్యాగాన్ని కొనియాడుతూ.. అది కూడా ఎంతోమంది వ్యాసకర్తల నుండి ఇలాంటి వ్యాసాల్ని సేకరించి పుస్తకాన్ని వేయడం అరుదైన విషయమే. ఇందులోని వ్యాసాలు నిజంగానే ఎంతో మందిని నిద్రమేల్కొలుపుతాయి. 

ఎంతోమందికి ఏనాడో మర్చిపోయిన నాన్నను గుర్తుచేస్తూ కన్నీళ్లు పెట్టిస్తాయి. మరెంతోమందికి ఒకనాడు భారంగా అనిపించిన తమ నాన్న ఇప్పుడు మళ్లీ పుడితే బాగుండు అనిపిస్తాయి. 
‘నాన్నా నీ గుండెలపై నడక నేర్చుకున్నాను.. నీ చూపుడు వేలితో లోకాన్నే చూశాను..’ అని కన్నీళ్ల పర్యంతమై విలపించాలనిపిస్తాయి. నిజానికి ఇందులోని వ్యాసాలన్నీ ఆయా వ్యాసకర్తల సొంత నాన్నల వాస్తవ స్థితిగతుల్ని అక్షర బద్దం చేసిన ఆణిముత్యాలు. 

అందరి తండ్రులూ తమ పిల్లల్ని ఒకేలా పెంచరు. తమ పిల్లల అభివృద్ది కోసం పాటుపడిన తీరూ ఒకేలా ఉండదు. పిల్లల విషయంలో బాధ్యతలు నిర్వర్తించడంలోనూ అందరు తండ్రుల విధానమూ ఒకే రకంగా ఉండదు. కానీ.. పిల్లల్ని పెంచే బాధ్యత, ప్రేమ విషయంలో అందరు తండ్రులు ఒకటే అన్న సత్యం ఇందులో వ్యాసకర్తలందరి భావనల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

“అమ్మ ప్రేమ అమ్మ ఒడిలాంటిది. వెంటనే తెలిసిపోతుంది. నాన్న ప్రేమ గుడిలాంటిది. భక్తితో నమస్కరించినా అందులో దైవం స్పందన మనకు తెలియదు. అది గాలి, వెలుతురులా దాని ప్రభావం తెలుస్తుంది కానీ భౌతికంగా స్పర్శ ద్వారా తెలిసేది కాదు” అని సుద్దాల అశోక్ తేజ తన ప్రతిస్పందనలో తెలిపినట్లు, ఇందులో వ్యాసకర్తలు తమ అభివృద్ధిలో నాన్న ప్రత్యక్షంగా భాగస్వామి ఎట్లా అయ్యాడో తెలిపినట్లే.. నాన్నల పరోక్ష భాగస్వామ్యాన్నీ గుర్తుచేసుకున్నారు. 

అంటే నాన్నప్రేమ పైకి సుస్పష్టంగా కనిపించకున్నా అంతర్లీనంగా ఆయన తమ పిల్లల ఎదుగుదల కోసం ఎన్నో రాత్రులు తపించిన సందర్భాలుంటాయని వ్యక్తపరిచారు. ఈ భావనలు సమాజంలో ప్రతి పుత్రుడికి ఎక్కడో ఒకచోట, ఏదో రకంగా అనుభవంలోకి తెచ్చేవే. 

‘‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమన్నాడు.. అన్నం పెట్టిన వారికి దండం పెట్టమంటాడు మానాన్న...” అని విలువల్ని నేర్పిన తండ్రిని గుర్తుచేసుకుంటారు ఏ.పి.వెంకటరెడ్డి అనే వ్యాసకర్త. “అందరిలా తడి ఆరని నా పసితనాన్ని కర్కశంగా కాన్వెంట్ శిలువ ఎక్కించలేదు మా నాన్న. ఇష్టంగా వీథి బడిలోనే చేర్పించాడు. మట్టిలో ఆడుకోనిచ్చాడు, మట్టి మనుషులతో తిరగనిచ్చాడు, మంచిచెడుల సంగతులన్నీ తెలుసుకోనిచ్చాడు..” అని పిల్లల్ని పెంచడం ఒక కళగా భావించిన తండ్రి తత్వాన్ని గుర్తుచేసుకుంటారు 

మరో వ్యాసకర్త డా. కె.జి వేణు. “కొత్తబట్టలు ఈరోజు కాకపోతే మరొకసారి కొనుక్కోవచ్చు. కానీ మనిషి ప్రాణం ఎంతో విలువైంది, దాన్ని కాపాడడం మన బాధ్యత..” అని పండుగపూట బట్టలకోసం వెచ్చించాలనుకున్న డబ్బును యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఆసుపత్రిలో ఖర్చుచేసిన తండ్రి వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటాడు సిద్ధాంతం అనిల్ కుమార్ అనే వ్యాసకర్త.

“తమ బిడ్డల్ని తండ్రులు కళ్లెదురుగా మెచ్చుకోకూడదని కావచ్చు. బహిరంగంగా తననెప్పుడూ మెచ్చుకోని తండ్రి భవిష్యత్తులో వేదికల మీద తన సన్మాన సత్కారాలను చూసిన తండ్రిలో సన్నని గర్వరేఖను గమనించాన”ని తండ్రి అంతర్లీనమైన పుత్రప్రేమను తెలియజేశారు ఈ పుస్తక సంపాదకుడు డా. మడత భాస్కర్. 

“అనామకుణ్నైన నాలో బహుముఖ ప్రజ్ఞ ప్రస్ఫుటించడానికి నాన్న పనిగట్టుకొని చేసిన ‘నీకు ఏదీ చేతగాదు’ అనే నెగిటివ్ ప్రేరణే కారణమని” వెళ్లడించిన కటుకోజ్వల మనోహరాచారి వ్యాసం.. ఇట్లా దేనికదే ప్రత్యేకత సంతరించుకొని ఎవరికి నాన్నైనా నాన్నే అని సమాజంలోని ప్రతి కొడుకు హృదయాన్ని తట్టి లేపగలిగిన పుస్తకం ఇది. 

ఐఎఎస్ అధికారి, రిటైర్ఢ్ జెడి లక్ష్మీనారాయణ, సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ  వంటివారి ముందుమాటలతో, 398 పేజీలతో, 94 వ్యాసాలతో వెలువరించిన ఈ పుస్తకాన్ని సంపాదకుడు డా. మడత భాస్కర్ ప్రత్యేక శ్రద్ధతో, ముఖ్యంగా నాన్న భక్తితో తీర్చిదిద్దాడని తెలిసిపోతూనే ఉంది. 94 మంది వ్యాసకర్తల చేత నాన్నల పట్ల తమ హృదయాల్ని ఆవిష్కరింపజేసిన సంపాదకుడు ధన్యుడు. 
‘కని పెంచిన తలిదండ్రులు, కనిపించే దైవాలని’ గుర్తించలేని నేటి సమాజంలో ఎందరో ‘పుత్రరత్నాల’కు కనువిప్పు ఈ ‘మానాన్నగారు’ పుస్తకం. 

 

- కటుకోజ్వల మనోహరాచారి, కవి, కథారచయిత-

గమనిక:  మీరూ లైఫ్ & లిటరేచర్​ వ్యాసాలు  పంపాలి అనుకుంటున్నారా? అయితే.. ఈ వ్యాసాన్ని హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.