వెలుగు స్పెషల్: ఆయిల్ పామ్ తోట కరువు తట్టుకునే పంట

వెలుగు స్పెషల్: ఆయిల్ పామ్ తోట కరువు తట్టుకునే పంట

భారతదేశం తన వంట నూనెల అవసరాల కోసం ఏటా 80 నుంచి 90 లక్షల టన్నుల పామాయిల్‌‌ను ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.  కేంద్ర వాణిజ్యశాఖ డిజిసిఐఎస్,  సాల్వెంట్ ఎక్స్‌‌ట్రాక్టర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం రూ. 70,000 కోట్ల నుంచి రూ. 82,000 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తోంది. ఈ భారీ నిధులు విదేశాలకు తరలిపోకుండా అడ్డుకుని,  మన రైతుల జేబుల్లోకి  మళ్లించే  లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్  ఆయిల్ పామ్’ పథకం ద్వారా ఆయిల్ పామ్ సాగును భారీ రాయితీలతో ప్రోత్సహిస్తున్నాయి. 
 
పామ్ ఆయిల్ అనేది పండు గుజ్జు నుంచి తయారవుతుంది, ఇందులో సుమారు 45–-55% నూనె ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్లతో, ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ‘ఇ’తో సమృద్ధిగా ఉంటుంది. మార్కెట్‌‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న సాగునీటి వసతులు,  డిమాండ్‌‌కు తగినట్లుగా పంట మార్పిడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం దేశానికి తోడ్పడేలా రాష్ట్రంలో వంట నూనెల డిమాండ్‌‌ను తీర్చడానికి ఆయిల్ పామ్ సాగును మిషన్ మోడ్‌‌లో  చేపట్టింది. రాష్ట్రంలో కూరగాయల నూనెల లభ్యతను పెంచడం,  దేశీయ ఉత్పత్తిని,  ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా దిగుమతులను తగ్గించడం,  పంట వైవిధ్యం  ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశాలు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బలమైన ప్రోత్సాహకాలు,  క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల  నిరంతర అవగాహన సదస్సుల ఫలితంగా ఆయిల్ పామ్ సాగు దూసుకుపోతోంది.  ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటల్లో మొక్కలు నాటిన  మొదటి మూడు సంవత్సరాలపాటు అంతర పంటల సాగు కోసం సంవత్సరానికి  రూ.4,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహం అందజేస్తుండటం,  డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పరికరాలపై భారీ సబ్సిడీలు ఇస్తుండటంతో  రైతులు ఈ సాగు వైపు అత్యుత్సాహంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,871 మంది రైతులు స్వచ్ఛందంగా పేర్లను నమోదు చేసుకోగా, మొత్తం 1,24,824.28 ఎకరాల విస్తీర్ణం రిజిస్టర్ అయింది. ఇందులో ఇప్పటికే 10,763 మంది  రైతులు తమ పొలాల్లో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిచేయగా, క్షేత్రస్థాయిలో 35,266.52 ఎకరాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ తోటల పెంపకం  పూర్తయింది. 

శాస్త్రీయ నీటి నిర్వహణ..  కరువు తట్టుకునే శక్తి

ఆయిల్ పామ్ సాగుకు నీరు ఎక్కువగా అవసరమవుతుందనే అపోహ రైతుల్లో ఉంది. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే, కేవలం ఒక్క సీజన్ (120–135 రోజులు) వరి పంట  పండించడానికి 1,200 నుంచి 1,500 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుండగా.. అదే ఆయిల్ పామ్ పంటకు ఏడాది పొడవునా (365 రోజులు) బిందు సేద్యం (డ్రిప్) ద్వారా కేవలం 1,200 నుంచి 1,400 మిల్లీమీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. అంటే ఒక్క సీజన్‌‌లో వరి పంటకు వాడే నీటి వనరులతో ఆయిల్ పామ్ పంటను ఏకంగా ఒక సంవత్సరంపాటు  సాగు చేయవచ్చు. దీనివల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా, వాతావరణ మార్పులు,  ఎల్‌‌నినో  ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆయిల్ పామ్  తోటలు  కరువును తట్టుకుని రైతు  ఆదాయానికి  పూర్తి  భరోసానిస్తాయి.

పర్యావరణ పరిరక్షణ,  నేల సారాన్ని కాపాడే విధానం

పర్యావరణం, నేల రక్షణపరంగానూ ఆయిల్ పామ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంది.  వరి, పత్తి, మిర్చి వంటి పంటల్లో  రైతులు ఎకరానికి ఏటా 300 నుంచి 450 కిలోల రసాయన ఎరువులను వాడుతుండగా,  అందులో 60% నుంచి 70% ఎరువు నీటిద్వారా కొట్టుకుపోయి నేల,  భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది. అదే  ఆయిల్ పామ్‌‌లో డ్రిప్ ఫెర్టిగేషన్, తోటలోని ఎండిన మట్టలతో చేసే ఆర్గానిక్ మల్చింగ్ వల్ల 35% నుంచి 40% పోషకాలు సహజసిద్ధంగానే  తిరిగి చెట్టుకు  అందుతాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తక్కువ. నేలలో సేంద్రియ కర్బనం పెరగడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన, కాలుష్య రహిత నేలలను అందించినవారమవుతాం.

అద్భుతమైన మార్కెట్ ధరలు, ఆర్థిక భద్రత

సంప్రదాయ పంటలైన పత్తి, వరి, కూరగాయల సాగులో  రైతులను అత్యధికంగా వేధించే సమస్య చీడ పీడలు,  వన్యప్రాణుల బెడద.   కానీ ఆయిల్ పామ్ సాగులో చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కోతులు, అడవి పందులు, నెమళ్లు వంటి జంతువులు ఈ తోటలను ఆశ్రయించవు.  కాబట్టి పంట నాశనమయ్యే భయం ఉండదు. దీనివల్ల సస్యరక్షణ చర్యలకు, పురుగుమందుల పిచికారీకి వెచ్చించే పెట్టుబడి ఖర్చు మిగతా పంటలతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉంటుంది.  గత దశాబ్ద కాలంలో వరి కనీస మద్దతు ధర సుమారు 65% నుంచి 70% పెరిగి క్వింటాల్‌‌కు  రూ.2,441కి చేరగా,  ఆయిల్ పామ్ తాజా గెలల ధర మాత్రం అద్భుతమైన వృద్ధిని సాధించింది.  దశాబ్దం క్రితం టన్ను గెలల ధర రూ. 9,000లోపు ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌‌లో ఆయిల్ పామ్ తాజా గెలల ధర  టన్నుకు  రూ. 24,000 పైమాటే పలుకుతోంది. అంటే గత పదేళ్లతో పోలిస్తే ఆయిల్ పామ్ గెలల ధర ఏకంగా 150% నుంచి 165% వరకు (రెండున్నర రెట్లు) భారీగా వృద్ధి చెంది, రైతన్నలకు సరికొత్త ఆర్థిక భద్రతను అందిస్తోంది.

 దీర్ఘకాలిక సంపద సృష్టి 

రైతు కష్టపడి రెండు సీజన్లలో వరి సాగుచేస్తే వచ్చే నికర లాభం.. ఆయిల్ పామ్ తోటలో కేవలం ఆరు నెలల గెలల దిగుబడితోనే సమకూరుతుంది.  అనగా  రెండు సంవత్సరాల వరి ఆదాయం ఆయిల్ పామ్ రైతుకు  ఒక్క  సంవత్సరంలోనే  లభిస్తుంది.  ముప్పై సంవత్సరాలపాటు ఏకధాటిగా దిగుబడినిచ్చే ఈ తోటల ద్వారా..  వరిసాగులో దాదాపు ఆరు దశాబ్దాలకు (60 సంవత్సరాలకు) సరిపడా సంపదను కేవలం 30 సంవత్సరాల కాలంలోనే  ఆయిల్ పామ్ రైతు సొంతం చేసుకునే స్పష్టమైన అవకాశం కనిపిస్తోంది.  వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు,  ప్రజాప్రతినిధులు సమన్వయంతో  రైతులను ముందుకు నడిపిస్తే, ఆయిల్ పామ్ తోటలు అన్నదాతల జీవితాల్లో  నిజమైన బంగారు బాటలు వేయడంలో సందేహం లేదు. 

- ఈదులపల్లి రవితేజ
వ్యవసాయ విస్తరణ అధికారి