చైన్ స్నాచర్ దొర్కిండు..ఉత్కుడు ఉత్కిన్రు

చైన్ స్నాచర్ దొర్కిండు..ఉత్కుడు ఉత్కిన్రు

హైదరాబాద్ : నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ బాలకృష్ణ నగర్ లో కూరగాయలు కొనుగోలు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి సైనిక్ పురికి ఎలా వెళ్లాలని అడ్రాస్ అడిగాడు. తనకు తెలియదని చెప్పే సమయంలోనే సదరు వ్యక్తి.. తన జేబులో నుండి కారం తీసి మహిళ కండ్లల్లో చల్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బాధితురాలి భర్త టూవీలర్ పై వస్తూ ఈ సంఘటనను గమనించాడు. చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశాడు. నిందితుడి జేబులో వెతకగా.. అతడికి సంబంధించిన వివరాలు తెలిశాయి. నిందితుడి పేరు సంతోష్ కుమార్ అని చెబుతున్నారు. అంతేకాదు.. రెండు ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు లభించాయి.