బీడ్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వందేళ్ల తర్వాత పులి కనిపించింది. అస్టి తాలుకాలోని బ్రహ్మగామ్ రేంజ్లో పులి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ జిల్లాలో 1910 నుంచి 1920 వరకు పులులు సంచరించాయి. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే పులి కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో ఆవుదూడను పులి చంపేయడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ట్రాకింగ్ కెమెరాలో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ కావడం గమనార్హం. టీ22 పులికి జన్మించిన మగ పులిగా అటవీ అధికారులు గుర్తించారు. 2023లో తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కవ్వాల్ టైగర్ జోన్లో సంచరించిన పులి.. కవ్వాల్ నుంచి మహారాష్ట్ర వెళ్లింది. పులికి హాని చేయకుండా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పులులకు ప్రసిద్ధి. పులి అడవి సంపన్నతకు ప్రతీక.
నడకలో రాజసం, వేటలో గాంభీర్యం ప్రదర్శించే ఈ జంతువు.. ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటూ మిగతా జంతువులు, జీవుల జనాభాను పరోక్షంగా నియంత్రిస్తుంది. ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పులి పాత్ర కీలకమైనది. పులుల ఉనికి అడవికి అందం, రక్ష. అడవిలో వాటి సంఖ్యను బట్టే పర్యావరణ సమతుల్యతను అంచనా వేయొచ్చు. పులులు అంతరించిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది.
