
మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘ఆప్ జైసా కోయి’. ఈ ప్రేమకథా చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా కరణ్ జోహార్ నిర్మించారు. ఈ న్యూ ఏజ్ లవ్‌స్టోరీని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30 ఏళ్ల మహిళ చుట్టూ జరిగే కథ ఇది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. రెండు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.
ట్రెడిషనల్‌గా ఉండే శ్రీ రేణు (ఫాతిమా).. సారీ చెప్పేందుకు ఇష్టపడని మధు బోస్ (మాధవన్) మధ్య ప్రేమ, ప్రణయం, కోపతాపాలు, ఆధిక్యత లాంటి అంశాలతో ముడిపడిన జీవిత ప్రయాణం ఇది. మన చుట్టూ మనమే నిర్మించుకున్న కొన్ని కట్టుబాట్ల నుంచి ఎలా విముక్తి పొందాలనే విషయాన్ని ఇందులో చర్చించామని, అందరికీ కనెక్ట్ అవుతూనే కొన్ని విషయాలను ప్రశ్నిస్తుందని దర్శకుడు వివేక్ సోని తెలియజేశారు. ‘తను వెడ్స్ మను’ లాంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్.. మరోసారి ఇదే జానర్‌లో వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.