అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావటంలేదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. జాయింట్ సర్వే కోసం రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసి..అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం భూమిని సర్వే చేసి, జాయింట్ ఇన్ఫెక్షన్ చేసి సర్వే నివేదికను జారీ చేసేందుకు బాధితుడి నుంచి రూ. 30లక్షలు డిమాండ్ చేశారు.చివరకు రూ.20 లక్షలకు ఒప్పుకొని ఆ లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ బత్తుల శ్రీనివాసులును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లంచం డిమాండ్ వ్యవహారంలో అబ్దుల్లాపూర్మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఆయనను కూడా నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు.
►ALSO READ | కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే మండల సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్ దగ్గర నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
