సినిమా అంటేనే ఫేమ్ కోసం ఈ ఇండస్ట్రీని ఎంచుకుంటారని కొందరు అనుకుంటారు. కానీ, తనలో ఉన్న కళను, ప్రతిభను ప్రదర్శించే అద్భుతమైన ప్లాట్‌ఫాం అని కొందరే గుర్తిస్తారు. అందుకే అలాంటివాళ్లు మనీ, ఫేమ్ కంటే క్రాఫ్ట్కే విలువనిస్తారు. అలాంటివాళ్లలో ఒకరు ఈ తమిళ నటుడు లల్లు (Lallu).
తమిళ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న లల్లు నటుడు మాత్రమే కాదు.. రచయిత కూడా. అతని పూర్తి పేరు లల్లు ప్రసాద్ (Lallu Prasath). ‘రంగూన్’ లల్లు అని కూడా పిలుస్తారు. రంగూన్, ఖైదీ, మాస్టర్, సర్కార్, అమరన్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. నేచురల్ యాక్టింగ్‌తో అట్రాక్ట్ చేసే ఈ యాక్టర్ ప్రస్తుతం ‘రిసార్ట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. అది ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటోంది.
తమిళనాడులోని తిరువణ్ణామలై నుంచి వచ్చిన లల్లు, చెన్నైలోని లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివాడు. కాలేజీ రోజుల్లోనే సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. వివిధ జానర్‌లలో పదికి పైగా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాడు. వాటికి పాటలు, డైలాగులు కూడా తనే రాశాడు. అలా లల్లు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఫేమస్ అయ్యాడు. దాంతో దర్శకుడు ఆర్. పార్థిబన్ కూతురు కీర్తన, లల్లు చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి అతన్ని రోల్ కోసం రెకమెండ్ చేసింది.
2014లో ‘కథై తిరైకథై వసనం ఇయక్కం’తో డెబ్యూ చేసే చాన్స్ వచ్చింది. పార్థిబన్ అదే ప్రాజెక్ట్‌లో అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా తీసుకున్నాడు. కాలేజీ ప్రాజెక్ట్‌ల నుంచి ఫీచర్ ఫిల్మ్స్‌కు మారడం అతని సహనాన్ని పరీక్షించింది. కానీ స్టోరీటెల్లింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అతన్ని దర్శకత్వం, రచన కొనసాగించేలా చేసింది.
రైటర్- నుంచి-డైరెక్టర్‌గా మారిన వాళ్లతో కలిసి పనిచేయాలని ఉందని తరచూ చెప్తుంటాడు. ఫేమ్ కంటే క్రాఫ్ట్‌పై గౌరవం చూపిస్తాడు లల్లు. అయితే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేని చాలామంది నటులలాగే లల్లు కూడా ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అవకాశాల కోసం వేచి ఉండటం, చిన్న రోల్స్ చేస్తూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కాస్త టైం పట్టింది.
సపోర్టింగ్ రోల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ స్టార్‌డమ్ ఇవ్వలేకపోయాయి. మొదటి ప్రాజెక్ట్‌లో రైటర్, యాక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆ టైంలోనే మరో ప్రాజెక్ట్ కూడా చేశాడు. అదే ఇంగ ఎన్న సొల్లుతు. ఇందులో తను రాసిన పాటలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇండస్ట్రీలో పాటల రచయితగా తన మార్క్ వేసుకున్నాడు.
మాస్టర్ ఎక్స్‌పీరియెన్స్
‘‘మాస్టర్‌లో నాది చిన్న రోల్. అయినా చాలా ఎనర్జిటిక్‌గా చేశా. విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆడిషన్లో సెలక్ట్ కావడంతో ఆ రోల్ వచ్చింది. విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని మెమరీ. సెట్లో విజయ్ చాలా హెల్ప్ చేశారు. షాట్స్‌లో ఎక్కువ వెయిటింగ్ ఉండదు. టైం పాటిస్తారు. సిన్సియర్, ఎనర్జిటిక్, వినయంగా ఉంటారు.
సెట్లో ఉన్నంతసేపు స్క్రిప్ట్ రీడింగ్స్, ఎమోషనల్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేస్తుంటాం. ఆయనెప్పుడూ లైఫ్ చాలా చిన్నది. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలని చెప్తుంటారు. ఆయన స్టార్ హీరో మాత్రమే కాదు.. చాలా మంచి మనిషి కూడా. అందుకే ఆయన్ని తలపతి (లీడర్) అంటారని అర్థమైంది” అని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు లల్లు.
అంతా మారిపోయింది
2017లో అంతా మారిపోయింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ‘రంగూన్’లో కుమారన్ పాత్రకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. లీడ్ రోల్‌తో తన పాత్రకు ఉన్న కెమిస్ట్రీ, మెమొరబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. అదే సినిమాలో “ఫారిన్ రిటర్న్” పాటకు రచయితగా కూడా కంట్రిబ్యూట్ చేశాడు లల్లు. క్రిటిక్స్, ఆడియెన్స్ అతని నేచురల్ యాక్టింగ్, వెర్సటాలిటీని మెచ్చుకున్నారు. అలాగే సంగతమితిన్, నాన్ సిరితల్, సైరెన్, 2025లో విడుదలైన ‘మద్రాస్ కారన్’లో కనిపించాడు.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెడీ, ఇంటెన్సిటీ రెండింటినీ ప్రదర్శించగల సపోర్టింగ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. చెన్నైలో కాలేజీ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం నుంచి విజయ్, శివకార్తికేయన్ వంటి సూపర్‌స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకునే వరకు లల్లు ప్రసాద్ జర్నీ తన టాలెంట్‌తోపాటు నిశ్శబ్ద సహనానికి నిదర్శనం. ప్రస్తుతం తను నటించిన ‘రిసార్ట్’ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.
