క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన సినీ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి...

క్యాబ్ డ్రైవర్ ను కొట్టిన సినీ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి...

ఛత్రపతి సినిమాలో విలన్ కాట్రాజ్ గుర్తున్నాడా...? ఉండే ఉంటాడు... అంత ఈజీగా మర్చిపోయే ఆహార్యం, క్యారెక్టరా అది..! ఆ ఒక్క క్యారెక్టర్ తో టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నటుడు సుప్రీత్ రెడ్డి. అయితే.. సినిమాల్లోనే కాదు ఇతగాడు రియల్ లైఫ్ లో కూడా విలన్ లాగే ప్రవర్తిస్తున్నాడు. రోడ్డు ఉన్నాడని ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడికి దిగాడు సుప్రీత్ రెడ్డి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో సుప్రీత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగారం ప్రాంతంలో ట్రిప్ పూర్తి చేసి మరో బుకింగ్ కోసం వేచి ఉన్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీహరిపై నటుడు సుప్రీత్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు.

సుప్రీత్ రెడ్డి...తన ఫార్చునర్ కారులో వెళ్తున్న సమయంలో రోడ్డుకు అడ్డుగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు నుంచి దిగి తనను దుర్భాషలాడి చితకబాదినట్లు ఆరోపిస్తున్నాడు బాధితుడు. ఘటన జరిగిన వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు శ్రీహరి.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కీసర పోలీసులు. సుప్రీత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు బాధితుడు.