ఎవరితోనూ శత్రుత్వం లేదు.. నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెల్వదు: టైగర్ ష్రాఫ్

ఎవరితోనూ శత్రుత్వం లేదు.. నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెల్వదు: టైగర్ ష్రాఫ్

ముంబై: తనపై జరిగిన కాల్పుల ఘటనపై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని బెదిరింపులు రాలేదని తెలిపాడు. తనకు ఎవరితోనూ దీర్ఘకాలిక శత్రుత్వం లేదని.. దుండగులు అసలు తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలియదని చెప్పాడు. సాధారణంగా వీకెండ్స్‎లో ఫుట్‌బాల్ ఆడిన తర్వాత అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతానని.. అయితే ఆదివారం (అక్టోబర్ 18) అలసిపోవడం వల్ల ఫోటో సెషన్‌కు దూరంగా ఉన్నానని వివరించాడు. ఈ నిర్ణయమే తన ప్రాణాలను కాపాడి ఉండవచ్చని ష్రాఫ్ అభిప్రాయపడ్డాడు. 

కాగా, ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఫుట్‎బాల్ ఆడి కారులో వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా.. అతని డ్రైవర్ గాయపడ్డాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ష్రాఫ్ కారుపై  కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తోన్న ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్‎లోని కోటాలో అరెస్ట్ చేశారు.

ష్రాఫ్‎పై కాల్పుల ఘటనపై సీరియస్‎గా స్పందించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే నిందితులపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే స్వయంగా ష్రాఫ్ ఇంటికెళ్లి అతడిని పరామర్శించాడు. ఈ దాడి నేపథ్యంలో టైగర్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అందించడానికి, అతని నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.