వరుస తెలుగు సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న సంయుక్త ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త ఇలా ముచ్చటించింది. ‘‘డైరెక్టర్ బోయపాటి ఈ కథ చెప్పగానే ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. అంతలా నచ్చేసింది. ఆయన గ్రేట్ విజన్‌తో మన ఇమాజినేషన్‌కి మించి ఉండేలా ఈ సినిమా తీశారు.
సినిమాకు ఎంతో కీలకమైన పాత్ర పోషించాను. నా క్యారెక్టర్ స్టైలిష్‌గా ఉంటుంది. అంతకుమించి ఎక్కువ రివీల్ చేయలేను. ఇక ‘జాజికాయ’ పాట గురించి చెప్పాక నెర్వస్‌గా అనిపించింది. గతంలో నేనెప్పుడూ అంత మాస్ సాంగ్ చేయలేదు. రెండ్రోజుల ప్రాక్టీస్ తర్వాత మోకాలు సహకరించలేదు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయడమే మన లక్ష్యం. అందుకే ఫిజియోథెరపీ చేయించుకుని ఆ పాట పూర్తి చేశా.
ఇక బాలయ్య గారు వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ను ఓ యాడ్ షూట్‌లో ఫస్ట్ టైమ్ కలిశా. పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడారు. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. తమన్ కంపోజ్ చేసిన పాటలు శివుడికి ట్రిబ్యూట్‌లా ఉండబోతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కేర్ తీసుకున్నారు. సంస్కృతంలో వినిపించే పదాలు, అద్భుతమైన సాహిత్యం మనల్ని ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి. స్వతహాగా నేను స్పిరిచువల్ పర్సన్‌ని. అందుకు తగ్గట్టే ఎక్కువగా మైథిలాజికల్ టచ్ ఉన్న సినిమాలు చేస్తున్నానని మా అమ్మ కూడా అంటోంది.
అయితే ఇదేమీ నేను ప్లాన్ చేసుకున్నది కాదు. గాడ్ గిఫ్ట్‌గా అలాంటి సినిమాలు వరుసగా వస్తున్నాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం ఫుల్ హ్యాపీ. బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశా. ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ మారాయి. ‘విరూపాక్ష’ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. నేను మాత్రం సెలెక్టెడ్‌గానే చేస్తున్నా. ‘స్వయంభు’లో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నా. ‘నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి క్యారెక్టర్. వీటి తర్వాత బ్లాక్ గోల్డ్, పూరి గారి సినిమాలు చేస్తున్నా. పూరి గారితో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్”.
