దండారి వేడుకల్లో.. గుస్సాడి హంగామా!

దండారి వేడుకల్లో.. గుస్సాడి హంగామా!

తలపై నెమలి ఈకల కిరీటం..జింక కొమ్ములు...మేక చర్మంతో శరీరాన్ని కప్పుకొని ఒంటిపై సంప్రదాయ ఆభరణాలు ధరించి... చేతిలో వాయిద్యాలు.. తుడుము మోతకు కాలు కదిపే ఆదివాసీ బిడ్డలు.. చూడగానే ఒళ్లు పులకించే ఈ నృత్యమే గుస్సాడి. అడవిబిడ్డల జీవన విధానం, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్న ఈ అరుదైన కళారూపం తరతరాలుగా గోండుల సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతోంది. 

ఉత్తర తెలంగాణ అడవుల్లో మారుమోగే గుస్సాడి నృత్యం.. ఇప్పుడు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.తెలంగాణలోని గిరిజన గ్రామాల్లో వేడుకలు ఏవైనా ఆదివాసీ సంస్కృతికి ప్రతీక అయిన గుస్సాడి  డాన్స్ కార్యక్రమం ఉండాల్సిందే. గుస్సాడి ప్రధానంగా దండారి ఉత్సవ సంప్రదాయంలో ప్రదర్శిస్తారు.దీపావళి సమయంలో రాజ్‌గోండ్ సమాజంలో జరిగే ఉత్సవాల్లో నృత్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

దండరి అనేది ఒక పండుగ. గుస్సాడి అనేది దండరి ఉత్సవంలో ఒక భాగమైన నృత్య రూపం.తెలంగాణలోని ఆదిలాబాద్ గోండులు దీపావళి పండుగ సమయంలో ప్రదర్శించే ఒక సాంప్రదాయ జానపద నృత్యం.వారు తమ పంటల రక్షణ కోసం జంగూ బాయి, నాగోబా, భీమ్ సేన్, వాగోబా  వంటి దేవతలను పూజిస్తారు.

గిరిజన నృత్య రూపకాన్ని ఆదివాసీ పురుషులు దండరి బృందాలుగా ప్రదర్శిస్తారు. వాటిలోని చిన్న సమూహాలను గుస్సాడి అని పిలుస్తారు.రాజ్ గోండుల అతిపెద్ద పండుగలో ఒక భాగమైన గుస్సాడి, గతాన్ని వర్తమానానికి అనుసంధానించే ఒక సాంస్కృతిక చారిత్రక అనుభవం.గుస్సాడి నృత్యకారులు  దండరి అనే బృందాలుగా ఏర్పడి, పాడటానికి, నృత్యం చేయడానికి సమీప గ్రామాలకు వెళుతుంటారు.

 ప్రతి దండరి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు.కళాకారుల మందపాటి, గుండ్రని కొనతో చెక్కతో చేసిన బరువైన కర్రను పట్టుకుంటారు. గుస్సాడి నృత్యం చేసేవారికి దేవతలు ఆవహిస్తారని గోండుల నమ్మకం.ఈ పండుగ దీపావళికి  10 రోజుల ముందు ప్రారంభమవుతుందని ఊషేగాం గ్రామానికి చెందిన గుస్సాడి కళాకారుడు పెందూర్ అమృతరావు చెప్పారు.

గుస్సాడి కళాకారుల సంప్రదాయ వేషధారణ

గుస్సాడి నృత్యం  చేసే కళాకారుల సంప్రదాయ వేషధారణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.ముదురు ఎరుపు, కాషాయం, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో ముంచిన ప్రకాశవంతమైన వస్త్రాలు, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, అద్దాలు, సంప్రదాయ ఆభరణాలు, తలపాగాలు,గాజులు, గజ్జలతో కూడిన కాలి గొలుసులు, నడుము పట్టీలు ధరించి డాన్స్ చేస్తుంటారు.

గుస్సాడి నృత్యకారుడిగా ఒక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల శ్రేయస్సు చేకూరుతుందని గిరిజనుల విశ్వాసం. ప్రదర్శన తర్వాత నృత్యకారుల పాదాలను కడగడం అనేది గౌరవసూచకమైన స్థానిక సంప్రదాయం. సంప్రదాయ వాయిద్యాల లయకు అనుగుణంగా బృందంగా నృత్యం చేస్తుంటారు.ప్రదర్శనకు ముందు నృత్యకారులు తమ దేవతలను పూజిస్తారు. తమ వాయిద్యాలను శుభ్రం చేసుకుంటారు.పండుగకు ముందే  తమ దుస్తులను సిద్ధం చేసుకుంటామని గుస్సాడి డాన్సర్ గెడం శంకర్ తెలిపారు. 

వస్త్రధారణలో నెమలి ఈకలు, అద్దాలు, పూసలతో చేసిన శిరోభూషణాలు ఉంటాయి. కొన్నిసార్లు వీటిని జింక లేదా మేక చర్మాలతో కలిపి ధరిస్తారు. వారి శరీరాలకు తరచుగా బూడిద లేదా సున్నం పూసుకుంటారు.డప్పులు, వాయు వాయిద్యాలు బృంద కదలికలకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ కదలికలలో తరచుగా నెమళ్లు, జింకల వంటి జంతువుల నుంచి ప్రేరణ పొందిన కూర్పులు, అడుగులు ఉంటాయి. తన తాత ముత్తాతల కాలం నుంచి తాను గుస్సాడి డాన్స్ నేర్చకున్నానని
గుస్సాడి డాన్సర్ గెడం శంకర్ చెప్పారు.

గిరిజన గ్రామాల్లో గుస్సాడి సందడి

గుస్సాడి నృత్యం తెలంగాణకు చెందిన ఒక అద్భుతమైన జానపద కళారూపం. దీనిని దీపావళి సమయంలో గోండు తెగవారు ప్రదర్శిస్తారు.ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఆదిలాబాద్ గ్రామాలు డప్పుల చప్పుళ్లు, వేణుగానం, గుస్సాడి నృత్యకారుల లయబద్ధమైన అడుగులతో సందడిగా మారుతాయి. రాజ్ గోండ్, కోలం తెగల వారు ప్రదర్శించే ‘గుస్సాడి’ ఒక సాంప్రదాయ నృత్యం. ఇది పంట కాలానికి స్వాగతం పలుకుతూ, పూర్వీకులను గౌరవించే వేడుకగా సాగుతుంది.

పూర్వీకులు  దేవతలకు సమర్పించే ఒక ఆచారంగా, అలాగే ప్రకృతి  పంటకు కృతజ్ఞత తెలిపే ప్రక్రియగా గుస్సాడికి గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది.నృత్య గురువు ‘దోర్లా’ మార్గదర్శకత్వంలో డప్పులు, గాలి వాయిద్యాల లయకు అనుగుణంగా నృత్యకారులు ఉత్సాహభరితమైన అడుగులు వేస్తూ, గెంతుతూ ధైర్యం, సంబరం, సంప్రదాయం పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు.

ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ, వారిని జానపద, పురాణ గాథల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది.గిరిజన గ్రామాల్లో సందడి చేస్తున్న గుస్సాడి డాన్స్ వీడియోలు సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ఎక్స్ పోస్టులు, వాట్సాప్ గ్రూపుల్లోనూ  హల్ చల్ చేస్తున్నాయి.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ... గుస్సాడి నృత్య ప్రదర్శనలిస్తూ...

పద్మశ్రీ పురస్కార గ్రహీత, దివంగత గుస్సాడి నృత్య మాంత్రికుడు కనకరాజు రెండవ కుమారుడైన కనక సుదర్శన్, తెలంగాణ ప్రాచీన గిరిజన సంప్రదాయ నృత్యమైన గుస్సాడి కళా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. రాజ్‌గోండ్‌ ఆదివాసీ వర్గానికి చెందిన ఈయన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గుస్సాడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శిస్తూ, ఆ ఆదివాసీ కళను సజీవంగా ఉంచుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వంటి ప్రతిష్టాత్మక వేదికలపై గుస్సాడి నృత్య బృందానికి నాయకత్వం వహించి ప్రదర్శనలు ఇచ్చారు.తన తండ్రి మరణం తర్వాత గుస్సాడి నృత్యానికి మరణం లేదని నిరూపిస్తూ సుదర్శన్ ఈ కళను భావితరాలకు అందిస్తున్నారు.

పద్మశ్రీ కనకరాజు గుస్సాడి డాన్స్ ఇన్ స్టిట్యూట్

గిరిజన యువకులకు గుస్సాడి డాన్స్ లో శిక్షణ ఇచ్చేందుకు ఉట్నూరులోని పీఎంఆర్సీ కేబీ కాంప్లెక్స్ కేంద్రంగా పద్మశ్రీ కనకరాజు గుస్సాడి డాన్స్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు.తన తండ్రి మరణించినా, గుస్సాడి డాన్స్ కు పద్మశ్రీ పురస్కారాన్ని సాధించి గుర్తింపు తీసుకువచ్చారని,ఆయన గుర్తుగా గిరిజన యువతకు గుస్సాడి డాన్స్ లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు పద్మశ్రీ కనకరాజు కుమారుడు కనక సుదర్శన్. 


కనకరాజు మరణించినా,  ఆయన ఏర్పాటు చేసిన గుస్సాడి డాన్స్ స్కూల్ ద్వారా వందలాది మంది గిరిజన యువకులకు ఈ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.నృత్యకారులు తమ దేవతలను పూజిస్తారు వారి శరీరాలకు తరచుగా బూడిద లేదా సున్నం పూసుకుంటారు. డప్పులు, వాయు వాయిద్యాలు బృంద కదలికలకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ కదలికలలో తరచుగా నెమళ్లు, జింకల వంటి జంతువుల నుంచి ప్రేరణ పొందిన కూర్పులు, అడుగులు ఉంటాయి.

వేడుక ఏదైనా గుస్సాడి డాన్స్​

తరతరాలుగా, పంట పండుగలు, మతపరమైన వేడుకలు, వివాహాలు, సామాజిక సమావేశాల సమయంలో గుస్సాడి నృత్యం ప్రదర్శిస్తుంటారు.మురళి బృందం  దేశవ్యాప్తంగా ప్రముఖ స్టేజ్ షోలలో, సాంస్కృతిక ఈవెంట్లలో గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇస్తుంది.

తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ,తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఈవెంట్లలో గుస్సాడి డాన్సులు ఏర్పాటు చేస్తోంది.గిరిజన ఉత్సవాలు, నాగోబా జాతర, దండారీ,గుస్సాడి బృందాలతో డాన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

గుస్సాడి తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని రాజ్‌గోండ్ ఆదివాసీల సంప్రదాయ నృత్యం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గ్రామాల్లో ఈ డాన్స్ కు బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోనూ గుస్సాడిని ఆదిలాబాద్ గిరిజనుల ప్రత్యేక నృత్యంగా పేర్కొన్నారు.

గుస్సాడి నృత్యకారులు ఆదిలాబాద్,కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని గిరిజన గ్రామాల్లో నివసించే రాజ్ గోండ్, కొలాం తెగలకు చెందిన గిరిజన కళాకారులున్నారు. ఆదిలాబాద్ ఆదివాసీలకు గుస్సాడి ఒక ముఖ్యమైన సాంస్కృతిక ఆచారంగా కొనసాగుతోంది. ఇది పంట పట్ల కృతజ్ఞతకు, పూర్వీకుల పట్ల గౌరవానికి, గిరిజన వారసత్వ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.

దేశవ్యాప్తంగా గుస్సాడీ డాన్స్ ప్రదర్శనలు

గుస్సాడీ నృత్యం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ జానపద నృత్యాల్లో ఒకటి. తెలంగాణ గర్వించదగ్గ సాంస్కృతిక సంపద. దీనిలో   తెలంగాణ ప్రజల చరిత్ర, నమ్మకాలు, దైనందిన జీవితం ఇమిడి ఉంటాయి.

తెలంగాణ  విశిష్ట జానపద నృత్య రూపాల్లో ఒకటైన గుస్సాడి డాన్స్  నేడు గిరిజన గ్రామాల్లోనే కాకుండా నగరాలు  సాంస్కృతిక కేంద్రాల్లోనూ ప్రదర్శిస్తున్నారు. ఈ డాన్స్  ప్రజాదరణతో ప్రాంతీయ సరిహద్దులను దాటి విస్తరించింది. 

ప్రస్థుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లోనూ గుస్సాడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.ఈ డాన్స్ గణతంత్ర దినోత్సవ పరేడ్, ఇన్క్రెడిబుల్ ఇండియా పర్యాటక కార్యక్రమాలు, అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు,కార్పొరేట్ కార్యక్రమాల్లోనూ ప్రదర్శిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా బేల్సరి రాంపూర్ గ్రామానికి చెందిన గుస్సాడీ డాన్సర్ గెడం శంకర్ చెప్పారు.

పద్మశ్రీ ప్రకటనతో  గుస్సాడికి గుర్తింపు

గుస్సాడి నృత్యాన్ని విస్తృతంగా పరిచయం చేయడంలో విజయం సాధించిన  కనకరాజుకు 2021వ సంవత్సరంలో  పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.దీంతో దేశవ్యాప్తంగా గుస్సాడీ డాన్స్ గురించి ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయికి చెందిన కనకరాజు గుస్సాడీ నృత్యాన్ని తన తాత నుంచి నేర్చుకున్నారు. 1980వ సంవత్సరం ప్రారంభంలో ఆయన గుస్సాడి బృందానికి నాయకత్వం వహించారు.గుస్సాడి నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి ఆదివాసీ కళాకారుడు కనకరాజు.

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.