రామ్ చరణ్ బర్త్‌డే సర్ ప్రైజ్ గిఫ్ట్.. సుకుమార్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రెడీ!

రామ్ చరణ్ బర్త్‌డే సర్ ప్రైజ్ గిఫ్ట్..  సుకుమార్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రెడీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికతో వచ్చిన 'రంగస్థలం' మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా చరణ్, సుకుమార్ అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.  మళ్లీ ఈ ఇద్దరు దిగ్గాజాలు కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. వీరిద్దరి కాంబినేషన్ లో 'RC17'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుట్టినరోజున బిగ్ సర్ ప్రైజ్!

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక భారీ అప్‌డేట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ రోజే 'RC17' సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు, షూటింగ్ షెడ్యూల్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. 'పుష్ప 2' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతుందోనని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కథ, స్క్రిప్ట్ సిద్ధం..

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముగిశాయని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిస్థాయిలో లాక్ అయిందని సమాచారం. సుకుమార్ తనదైన శైలిలో రామ్ చరణ్‌ను ఒక సరికొత్త మేకోవర్‌లో చూపించబోతున్నారట. 'రంగస్థలం' పల్లెటూరి నేపథ్యంలో సాగితే, 'RC17' అంతకు మించి భారీ బడ్జెట్‌తో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉండబోతోందని టాక్.   ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.

రామ్ చరణ్ లైనప్..

ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'పెద్ది' షూటింగ్ పూర్తికాగానే, రామ్ చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. మార్చి 27న రాబోయే అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. గ్లోబల్ స్టార్ బర్త్‌డే ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి..