హే భగవాన్.. ఏంటీ మాయా.. ఇంట్లోని ఫ్రిడ్జ్ లోని డీప్ బాక్సులో అమర్నాథ్ కొండల్లోని మంచు శివ లింగం తరహాలో.. శివ లింగం ఆకారంలో మంచు పేరుకుపోయింది. ఇది చూసి షాక్ అయిన ఆ ఇంటోళ్లు.. ఇదంతా అమర్నాథ్ మహా శివుడి మాయ అని.. దానికి ప్రతిరూపం అంటూ పూజలు చేయటం మొదలుపెట్టారు. ఈ విషయం ఇంటి చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. వాళ్లు ఊరుకుంటారా ఏంటీ.. ఆనోట ఈ నోట అన్నట్లు.. జనం తండోపతండాలు తరలి వచ్చి.. ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఏర్పడిన మంచు లింగానికి శివుని ప్రతిరూపంగా పూజలు చేయటం మొదలుపెట్టారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న నాగ్లా భుజా (ఖేరియా మోడ్) ప్రాంతంలో అక్కడ నివసించే ఒకరింట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్‌లో అచ్చం శివలింగం లాంటి ఆకారంలో మంచు పేరుకుపోయింది. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల జనాలు ఆ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. అది సాక్షాత్తూ ఆ పరమశివుడి మహిమేనని నమ్మిన స్థానికులు.. ఆ ఫ్రిజ్ ముందే పూజలు చేయడం ప్రారంభించారు. జలాభిషేకాలు చేస్తూ, హారతులు ఇస్తూ ఆ ప్రాంతమంతా "హర హర మహాదేవ్" నినాదాలతో హోరెత్తించారు.
ప్రస్తుతం ఈ "ఫ్రిజ్ శివలింగం" ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు భక్తులు ఆ మంచు లింగం దగ్గర కానుకలుగా నాణేలు కూడా సమర్పించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. చూడ్డానికి ఇది చిన్నపాటి 'అమర్‌నాథ్ మంచు లింగం'లానే ఉందంటూ స్థానికులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వింతను చూడటానికి జనాలు వస్తూనే ఉన్నారు.
మరోవైపు.. కరిగిపోతున్న అసలైన అమర్‌నాథ్ మంచు లింగం
ఇంట్లోని ఫ్రిజ్‌లో మంచు శివలింగం పూజలందుకుంటుంటే.. అటు హిమాలయాల్లోని అసలైన అమర్‌నాథ్ మంచు లింగం మాత్రం వేగంగా కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం అమర్‌నాథ్ యాత్రపై పడింది. ఈ ఏడాది 57 రోజుల పాటు సాగాల్సిన యాత్ర ఇంకా పూర్తికాకముందే.. అక్కడ సహజంగా ఏర్పడే మంచు శివలింగం దాదాపు 90 శాతానికి పైగా కరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.
సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పవిత్ర గుహ చుట్టుపక్కల ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే వేగం కంటే, హిమాలయ పర్వత ప్రాంతాలు మరింత వేగంగా వేడెక్కుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలా ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లోని మంచు లింగం కరిగిపోతుంటే.. మరోవైపు ఆగ్రాలోని ఒక మధ్యతరగతి ఇంట్లో ఫ్రిజ్‌లో వెలిసిన మంచు శివలింగం మాత్రం భక్తులకు కొండంత భక్తిని, ఆనందాన్ని పంచుతోంది.
उत्तर प्रदेश : आगरा में एक घर में फ्रिज के अंदर "शिवलिंग" जैसी आकृति बन गई है। लोग इसे अमरनाथ के पवित्र हिमलिंग जैसी आकृति से जोड़ रहे हैं। पूजा–पाठ शुरू हो गई है। चढ़ावा आना शुरू हो गया है।@madanmohansoni pic.twitter.com/Kn31ko8tXQ
— Sachin Gupta (@Sachingupta) July 13, 2026
