- హార్ట్ బీట్ మారినా, బొడ్డుతాడు చుట్టుకున్నా క్షణాల్లోనే రెడ్ అలర్ట్
- కాన్పు మొదలైనప్పటి నుంచి డెలివరీ వరకూ ప్రతి సంక్లిష్టతను ముందే పసిగట్టే టెక్నాలజీ
- త్వరలోనే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో కాన్పుల వేళ తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రానుంది. పురిటి నొప్పులతో అల్లాడే గర్భిణి పక్కన నర్సో, డాక్టరో క్షణక్షణం లేకపోయినా.. కడుపులోని బిడ్డ గుండె చప్పుడు, ఆక్సిజన్ స్థాయిల్లో తేడాలను పసిగట్టి డాక్టర్లను అప్రమత్తం చేయనుంది. కాన్పు మొదలైనప్పటి నుంచి బిడ్డ సురక్షితంగా బయటకు వచ్చే వరకు ఎదురయ్యే ప్రతి సంక్లిష్టతను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు లేబర్ రూమ్‌లలో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఏఐతో క్షణాల్లో అలర్ట్
ఇన్నాళ్లూ ప్రసవ గదుల్లో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని మాన్యువల్‌గా పల్స్, బీపీ చూసి పేపర్లపైనే నమోదు చేసేవారు. వార్డుల్లో రద్దీగా ఉన్నప్పుడు రీడింగ్స్ నమోదు చేయడంలో కాస్త ఆలస్యమైనా, చిన్న మార్పులను గుర్తించలేకపోయినా.. బిడ్డ కడుపులోనే శ్వాస ఆడక చనిపోవడం (స్టిల్‌బర్త్), లేదా కాన్పు కాగానే తల్లికి తీవ్ర రక్తస్రావమై ప్రాణాల మీదకు రావడం వంటి పరిస్థితులు ఉండేవి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక కార్డియోటోకోగ్రఫీ (సీటీజీ) మెషిన్ల ద్వారా తల్లికి వచ్చే నొప్పుల తీవ్రతను, బిడ్డ గుండె వేగాన్ని ఏకకాలంలో డిజిటల్ స్క్రీన్‌పై రికార్డు చేస్తాయి. ఈ గ్రాఫ్ లను సాధారణ కంటితో చూసి అంచనా వేయడం కంటే, ఏఐ సాఫ్ట్వేర్ క్షణాల్లో విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది.
రియల్ టైమ్ మానిటరింగ్
కాన్పు సమయంలో బిడ్డ మెడకు బొడ్డుతాడు చుట్టుకున్నా, ఆక్సిజన్ అందక గుండె వేగంలో అసాధారణ హెచ్చుతగ్గులు వచ్చినా ఏఐ సాఫ్ట్వేర్ సెకన్ల వ్యవధిలోనే రెడ్ అలర్ట్ అలారాలతో డాక్టర్లను అప్రమత్తం చేస్తుంది. అలాగే కాన్పు వేళ లేదా ఆ తర్వాత తల్లుల ప్రాణాల మీదకు తెచ్చే అధిక రక్తస్రావాన్ని (పీపీహెచ్), బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే ముప్పును ఈ టెక్నాలజీ ముందే పసిగడుతుంది. మరోవైపు ఈ వ్యవస్థ కేంద్రం తీసుకొచ్చిన జనని పోర్టల్ నెట్ వర్క్ తో అనుసంధానమై పనిచేస్తుంది. దీనివల్ల మారుమూల సీహెచ్సీలలో చేరిన హై-రిస్క్ గర్భిణుల డేటా జిల్లా కేంద్రాలు, మెడికల్ కాలేజీల్లోని సీనియర్ ప్రసూతి వైద్యులకు రియల్ టైమ్‌లో స్క్రీన్లపై కనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ స్థానికంగా స్పెషలిస్ట్ లేకపోయినా, పట్నంలోని నిపుణులు అక్కడి నుంచే స్థానిక నర్సులకు సరైన ఆదేశాలు ఇస్తూ డెలివరీని పర్యవేక్షించవచ్చు.
అనవసర సిజేరియన్లకు చెక్
ఈ టెక్నాలజీతో సర్కారు దవాఖాన్లలో అనవసర సిజేరియన్ ఆపరేషన్లకు అడ్డుకట్ట పడనుంది. కాన్పు కొద్దిగా ఆలస్యమైన ప్రతిసారీ కంగారుపడి ఆపరేషన్ చేయకుండా, కడుపులో బిడ్డ సురక్షితంగా ఉందని ఏఐ స్పష్టతనిచ్చినంత వరకు డాక్టర్లు నార్మల్ డెలివరీ చేసేందుకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) జాతీయ సగటు 87 కంటే మెరుగ్గా 48గా ఉంది. లక్ష్య ప్రమాణాల ద్వారా స్టిల్బర్త్స్ సంఖ్యను ప్రతి వెయ్యి కాన్పులకు 5 లోపునకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వ్యవస్థను స్పీడప్ చేస్తున్నది. కార్పొరేట్ హాస్పిటళ్లలో లక్షల రూపాయల ప్యాకేజీలు చెల్లిస్తే తప్ప దక్కని ఈ హైటెక్ ప్రసూతి రక్షణ.. త్వరలోనే పేద మహిళలకు సర్కారు దవాఖాన్లలో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందనుంది.
