మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) రాజకీయ వైఖరి అఖిల భారత స్థాయిలో, తెలంగాణలో ఒకటేనా? భిన్నమా? నాలుగైదు మాసాల్లో ఎన్నికలు జరగాల్సిన యూపీలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు సాగిస్తున్న రాజకీయ ప్రచార సరళి రేపటి ఖైరతాబాద్ ఉప ఎన్నికను, రెండేళ్లకు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎంఐఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సఖ్యత కాంగ్రెస్‌తో ఇకపైనా కొనసాగుతుందా? బెడుస్తుందా? ఇప్పుడీ ప్రశ్నలెందుకు అంటే, ఒవైసీ తన యూపీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు అలా ఉన్నాయి.
‘ఇతర పార్టీలకు కార్పెట్లు పరిచే పొత్తులు, అవగాహనలకు ఎంఐఎం సిద్దంగా లేదు, మాకు రాజకీయ భాగస్వామ్యం (హిస్సెదారి) కావాలి’ అని గొంతు పెంచుతున్నారు. ఒవైసీ వైఖరిపై ‘సొంత రాష్ట్రంలో ప్రయోగించని, పాటించని రాజకీయ ఫార్ములాను ఇతర రాష్ట్రాల ముస్లింలకు వర్తింపచేయజూసే హిపోక్రసీ’ అన్న ఓ కాంగ్రెస్ నాయకుడి విమర్శ వ్యక్తిగతమా? పార్టీ అనుమతించినదా? అన్నది ప్రశ్న ! ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య సఖ్యత, వైరుధ్యం రాష్ట్ర ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే ‘కారకం’ కనుక, ఇప్పుడిది చర్చనీయాంశమౌతోంది.
తెలంగాణ ఏర్పడ్డ నుంచి దాదాపు పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌తో సఖ్యతగా ఉన్న మజ్లీస్ (ఎంఐఎం) 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వేరే బాట పట్టింది. బీఆర్‌ఎస్‌కు దూరమవుతూ కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. అనంతరం జరిగిన అసెంబ్లీ రెండు ఉప ఎన్నికలల్లో, ముఖ్యంగా చివరిదైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అభ్యర్థి ఎంపికలోనూ వారి సూచనను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఏమైతేనేం ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నెగ్గి, బీఆర్ఎస్ నుంచి మరో స్థానాన్ని కైవసం చేసుకున్నది. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదుపై దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన దరిమిలా ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక పరిస్థితి వచ్చింది. కేసు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఈసీ నిర్ణయంలో జాప్యం జరుగుతోంది. రేపటి ఎన్నికలో మజ్లిస్ అనుసరించే వైఖరే కీలకం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలోని 1.75 లక్షల ఓట్లలో ముస్లిం ఓటర్ల సంఖ్య సుమారు 50 వేల (దాదాపు 30 శాతం) వరకు ఉండటమే! మజ్లిస్ అభ్యర్థి బరిలో లేకుండా, వారు మద్దతిచ్చే అభ్యర్థికి ఎక్కువ ముస్లిం ఓట్లు సానుకూలంగా పడటం జరుగుతోంది.
కాంగ్రెస్‌కు కాదు..సీఎం రేవంత్‌రెడ్డికే మజ్లిస్ మద్దతు
మజ్లిస్‌కి కాంగ్రెస్‌తో ఉన్న సఖ్యత.. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నపుడు బెడిసింది. తెలంగాణ అవతరణ, నాటి టీఆర్‌ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం నేపథ్యంలో మజ్లిస్‌కు ఆ పార్టీతో సఖ్యత పెరిగింది. పదేళ్ల అంతరం తర్వాత ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయింది. అయితే, ఈ విషయంలోనూ అసదుద్దీన్ ఇటీవల ఓ వింతైన వివరణ ఇచ్చారు. నగరంలోని సంతోష్‌నగర్‌లో ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పాల్గొన్న అసద్ ‘రాష్ట్రంలో మా మద్దతు సీఎం రేవంత్‌రెడ్డికే తప్ప కాంగ్రెస్‌కు కాదు’ అన్నదే ఆయనిచ్చిన స్పష్టత. దానికి తగ్గట్టుగానే జాతీయ స్థాయిలో ‘ఇండియా కూటమి’లో బలమైన మిత్రులు సమాజ్
వాది పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అసద్ ఇప్పుడు యూపీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
రెండు గొంతులు
బీజేపీని ఢీకొనేందుకు విపక్షాలతో పొత్తుకు సిద్ధమే అంటూ.. వారినే లక్ష్యం చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. జూన్, జులై నెలల్లో విస్తారంగా సభలు, ర్యాలీలు నిర్వహించిన అసదుద్దీన్ నెల రోజులుగా మళ్లీ ప్రచారజోరు పెంచారు. ముస్లింలలో ఎస్పీకి బాగా పట్టున్న మతేర (బహ్రాయిచ్ జిల్లా), నజీబాబాద్ (బిజ్నోర్ జిల్లా), మొరాదాబాద్, శహరాన్‌పూర్ వంటి నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు జరుపుతూ ఎస్పీ నాయకత్వాన్ని, ఆ పార్టీకి చెందిన నేతల్ని ఘాటుగా అసద్ విమర్శిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి ఎన్నికైన నాయకులెవరూ స్థానికంగా అందుబాటులో ఉండరు, పనులు చేసిపెట్టరని విమర్శిస్తున్నారు.
అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లింలకు చేసిందేమీ లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకులుగా వినియోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ, ఆ ఉచ్చులో పడకూడదని చెబుతున్నారు. ముస్లింలలో స్వీయ నాయకత్వం ఎదగాలని, ఆ అవకాశం మజ్లిస్ కల్పిస్తుందని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రానీయకుండా నిలువరించడానికి విపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోరాడేందుకు ఎంఐఎం సిద్ధమని ఆయన ప్రకటిస్తున్నారు.
ఇతర పార్టీలకు తివాచీలు పరిచేందుకు మజ్లిస్ సిద్ధంగా లేదని, రాజకీయ భాగస్వామ్యం ఇచ్చేటట్టయితేనే పొత్తులకు తలుపులు తెరిచుంటాయని చెబుతున్నారు. వరస్పర విరుద్ధమైన ఈ వైఖరిని ఎస్పీ, కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తీవ్రంగా ఖండిస్తోంది. తమది బీజేపీకి ‘బి టీమ్’ అని విమర్శించే ఇండియా పక్షాలు, బీజేపీని ఓడించే నిజమైన చిత్తశుద్ధి చూపవని, బిహార్‌లో కేవలం 5 సీట్లు ఎంఐఎంకు ఇవ్వడానికి ఆర్జేడీ నిరాకరించిందని మజ్లిస్ యూపీ అధినేత షౌకత్ అలీ తప్పుబట్టారు. ‘వీళ్లకు ముస్లిం ఓట్లు కావాలికానీ,
ముస్లింలలో నాయకులు ఎదగొద్దంటారు’అన్నది అసద్ అభియోగం. అందుకే, మజ్లిస్ ద్వారా ఎదగండని ముస్లింలకు పిలుపునిస్తున్నారు.
‘మన వైఖరేంటి?’
మజ్లిస్‌తో కాంగ్రెస్ ఏ వైఖరితో ఉండాలనే విషయమై తెలంగాణ నాయకులు, కార్యకర్తల్లో స్పష్టత కొరవడింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో, రాష్ట్ర నాయకులున్నపుడే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ (ఎఐసీసీ) అడిగినట్టు, దానికి ఆయన ప్రత్యర్థి పార్టీగానే స్పందించాలన్నట్టు పార్టీ వర్గాల్లో ఓ ప్రచారముంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నదే ఆయన వైఖరికి కారణమై ఉంటుందని పార్టీ శ్రేణుల అంచనా. కానీ, యూపీ కాంగ్రెస్, ఎస్పీ నాయకులు మజ్లిస్‌తో పొత్తు ఉండొచ్చని జాగ్రత్తగా స్పందిస్తున్నారు.
యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా నిలువరించడానికి విపక్షాలతో జతకట్టడానికి సిద్ధమని, తలుపులు తెరిచే ఉన్నాయంటున్న ఒవైసీ కిందటి (2022) ఎన్నికల్లో ఇండియా కూటమితో కాకుండా ఇతర చిన్న పార్టీలతో జతకట్టారు. జన్ అధికార్ పార్టీ, భారత్ ముక్తి మోర్చా, జనతా క్రాంతి పార్టీ, భారతీయ వంచిత్ సమాజ్ పార్టీలతో కలిసి ఏర్పడ్డ కూటమి తరఫున ఎంఐఎం 90 స్థానాలకు పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ముస్లింలు 19 శాతం ఉన్నారు. పోలింగ్ తర్వాత సర్వే జరిపిన ‘సీఎస్‌డీఎస్’ అధ్యయనం ప్రకారం ముస్లిం ఓటర్లలో 79 శాతం మంది ఎస్పీకి, 3 శాతం కాంగ్రెస్‌కు, 6 శాతం బీఎస్పీకి ఓటు వేశారు.
మజ్లిస్‌కు మొత్తంమ్మీద దక్కిన ఓటు వాటా 0.49 శాతం. మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ మజ్లిస్ ఖాతా తెరవలేదు. బిహార్ ఎన్నికల్లో మాత్రం 5 స్థానాల్లో నెగ్గింది. మహారాష్ట్ర 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గతంకంటే తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంది. జాతీయ దృష్టితో ఈ అంశాలా? స్థానిక పరస్పర ప్రయోజనమా? ఏది తెలంగాణలో మజ్లిస్, -కాంగ్రెస్ సఖ్యతను తేలుస్తుందన్నది భవిష్యత్తే చెప్పాలి.
తెలంగాణలో పొత్తు..యూపీలో పరిణామాలు
దేశవ్యాప్త ముస్లింల ప్రయోజనాల కోసమంటూ బిహార్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల ఎన్నికల బరిలో దిగుతూ సొంత రాష్ట్రం తెలంగాణలో ఒక్క హైదరాబాద్ పాతబస్తీకే ఎందుకు మజ్లిస్ పరిమితమౌతోందనే విమర్శలు సహజం! ముస్లిం నాయకత్వం బయటి రాష్ట్రాల్లో ఎదగాలికానీ, తెలంగాణలో ఎదగొద్దా? ముస్లింలలో నాయకత్వ ఎదుగుదలకు మజ్లిస్ ఏం చేసింది? మహిళలకు, యువతకు ఏం అవకాశాలిస్తోంది? అని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సమీర్ వలియుల్లా ప్రశ్నించారు. తెలంగాణలో పాటించని రాజకీయ ఫార్ములాను మజ్లిస్ దేశమంతా వర్తింపచేస్తాననడం ఒట్టి వంచన, హిపోక్రసీ మాత్రమే అని ఆయన విమర్శించారు.
ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడకుండా, వారిని నాయకులుగా ఎదగనీయాలన్నదే మజ్లిస్ ఉద్దేశ్యమైతే తెలంగాణలో 9/119 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందని ఆయన తప్పుబట్టారు. ఇవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలా? పార్టీ అనుమతి ఉందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విమర్శలతోపాటు యూపీలో పరిణామాలు తెలంగాణలో మజ్లిస్, కాంగ్రెస్ సఖ్యతపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది అసదుద్దీన్ ఇక్కడ తీసుకోబోయే నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఈ విషయంలో స్పష్టత రావచ్చన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఉంది.
- దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.
