సౌదీ వెళ్లేవారికి బిగ్ అలర్ట్: అక్టోబర్ 24 వరకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

సౌదీ వెళ్లేవారికి బిగ్ అలర్ట్: అక్టోబర్ 24 వరకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతోన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీయ ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2026, అక్టోబర్ 24వ తేదీ వరకు సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు నడిచే విమాన సర్వీసులు ఈ రద్దు పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా శనివారం (అక్టోబర్ 17) ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సౌదీలోని జెడ్డా, రియాద్, దమ్మామ్‌లకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను 2026, అక్టోబర్ 24 వరకు తాత్కాలికంగా నిలిపివేశాయి’’ అని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని.. ఈ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ వెసులుబాటు కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 

అక్టోబర్ 15 లేదా అంతకంటే ముందు టికెట్ బుక్ చేసుకుని.. అక్టోబర్ 9 నుండి 25 మధ్య ప్రయాణించాల్సిన వారు ఎటువంటి అదనపు రుసుము లేకుండా నవంబర్ 10 లోపు తమ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని తెలిపింది. ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలనుకునే వారికి పూర్తిగా రీఫండ్ చెల్లిస్తామని చెప్పింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో ఇప్పటికే ఇండిగో, ఆకాశ్ ఎయిర్ సౌదీకి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.