ఒకప్పుడు పుస్తకం పట్టుకుని కూర్చోవడం అంటే నిశ్శబ్దంగా చదవడం.. లైబ్రరీకి వెళ్లడం అంటే పుస్తకాల మధ్య సమయం గడపడం. కానీ ఇప్పుడు చదవడానికీ కొత్త రంగులు అద్దుతున్నారు యువతరం. చేతిలో పుస్తకం.. చుట్టూ సంగీతం.. లైట్ల వెలుగులు.. స్నేహితుల సందడి! పుస్తక పఠనాన్ని ఓ సామూహిక వేడుకగా మార్చేస్తున్నారు.
ఒకవైపు సంగీత హోరులో పుస్తకాలు చదివే ‘రీడింగ్ రేవ్స్’.. మరోవైపు పుస్తకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ‘ఫ్లైబ్రరీలు’.. ఇలా చదివే అలవాటుకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. డిజిటల్ తెరల మధ్య తగ్గిపోతోందనుకున్న పుస్తకాల ప్రపంచం.. కొత్త రూపాల్లో మళ్లీ ఆకర్షిస్తోంది.
రీడింగ్ రేవ్స్తోపాటు నిశ్శబ్ద పఠన సమావేశాలకూ ఆదరణ పెరుగుతోంది. బెంగళూరులోని కబ్బన్ రీడ్స్, ఢిల్లీలోని లోధీ రీడ్స్ వంటి పఠన సమూహాలు ఇందుకు ఉదాహరణలు. ఇక్కడ ఎవరికి నచ్చిన పుస్తకాన్ని వారు తెచ్చుకోవచ్చు. నిర్ణీత సమయంలో అందరూ కలిసి చదువుతారు. పుస్తకం గురించి చర్చించాలనుకునేవారికి ఆ అవకాశం కూడా ఉంటుంది. తప్పనిసరిగా ఒకే పుస్తకం చదవాలనే నియమం లేకపోవడంతో కొత్తవారు సైతం ఈజీగా ఈ సమూహాల్లో చేరవచ్చు.
సామాజిక మాధ్యమాలే సరికొత్త ప్రేరణ
పుస్తకాలు చదివే అలవాటును పెంచడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వేదికల్లో పుస్తకాల పరిచయాలు, సమీక్షలు, ఇష్టమైన వాక్యాలు, చదివిన పుస్తకాల జాబితాలను పంచుకుంటున్నారు.
దీనివల్ల కొత్త రచయితలు, కొత్త పుస్తకాలు పాఠకులకు పరిచయమవుతున్నాయి. డిజిటల్ వేదికల ద్వారా పుస్తకాలను తెలుసుకుని, వాటిని చేతిలో పట్టుకుని చదివేందుకు ఆసక్తి చూపుతున్న యువత కూడా ఉన్నారు. మొత్తానికి పఠనం పాత పద్ధతుల్లోనే ఉండాలనే నియమాన్ని నేటి తరం పక్కనపెడుతోంది.
సంగీతం మధ్య అయినా, పార్కులో స్నేహితులతో కలిసి అయినా, విమానాశ్రయంలో నిరీక్షిస్తూ అయినా.. పుస్తకానికి కొంత సమయం కేటాయిస్తోంది. చదవడాన్ని బాధ్యతగా కాకుండా ఇష్టమైన అనుభవంగా మార్చుకుంటోంది. వేదికలు మారుతున్నాయి.. పద్ధతులు కొత్తగా ఉంటున్నాయి.. కానీ పుస్తకం ఇచ్చే ఆనందం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే!
విమానాశ్రయాల్లోనూప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని పఠన సమయంగా మార్చేందుకు భారత విమానాశ్రయాల్లోనూ ప్రత్యేక కార్యక్రమం అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఫ్లైబ్రరీ’. విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన పుస్తకాల అరల నుంచి ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకోవచ్చు. చదివిన తర్వాత మరోసారి విమానాశ్రయానికి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వొచ్చు. లేదా తమ దగ్గరున్న పుస్తకాన్ని అక్కడ ఉంచి మరొకరు చదివే అవకాశం కల్పించొచ్చు.
‘ఒక పుస్తకం తీసుకోండి.. మరో పుస్తకం ఉంచండి’ అనే ఆలోచనతో సాగుతున్న ఈ కార్యక్రమం పఠనాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని 72 విమానాశ్రయాలకు విస్తరించింది.
గమనిక: మీరూ లైఫ్ & లిటరేచర్ వ్యాసాలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. ఈ వ్యాసాన్ని హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
