హైదరాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా, భిన్న ఆలోచనలు కలిగిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న దత్తన్న ‘అలయ్.. బలయ్’ కార్యక్రమాన్ని ఈ నెల 22న హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్.. బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని ‘నషా ముక్త్ భారత్’ నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ‘అలయ్.. బలయ్’ కార్యక్రమం వివరాలను వారు మీడియాకు వెల్లడించారు.
ఈ ఏడాదితో 20 ఏండ్లు పూర్తి..
2005లో ప్రారంభమైన ఈ సాంస్కృతిక వేదిక ఈ ఏడాదితో 20 ఏండ్లు పూర్తి చేసుకుంటోందని ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి తెలిపారు. ఏటా దసరా తర్వాత ‘అలయ్.. బలయ్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకకు తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించినట్లు చెప్పారు.
