మాయమవుతున్న మనుషులు.. ఈ సండే జియో హాట్స్టార్లో ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రై చేయండి !

మాయమవుతున్న మనుషులు.. ఈ సండే జియో హాట్స్టార్లో ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రై చేయండి !
  • టైటిల్: అలీబాబా ఔర్​ 40 భూత్​
  • కాస్ట్: ఆశా నేగి, అభయ్ మహాజన్, విజ్వల్ చోప్రా, జాయ్ సేన్​గుప్తా, మృదుల్​ దాస్, మాన్సీ, సెహ్​గల్, రమణ్​దీప్ యాదవ్
  • డైరెక్షన్: కోనార్క్​ ముఖర్జీ – రిశవ్​ అగర్వాల్
  • ప్లాట్​ఫాం: జియో హాట్​స్టార్

అలీషా నేరుగా పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి తన తండ్రి తపేశ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. దీంతో పోలీస్ ఆఫీసర్ బాబా రంగంలోకి దిగుతాడు. దర్యాప్తులో అతనికి సహకరించేందుకు అలీషా కూడా అతనితో కలిసి ఉంటుంది. మరోవైపు, అక్కడికి కొంత దూరంలో ఉన్న తమోఘాటి ప్రాంతంలో మహాదేశ్ అనే మాంత్రికుడు క్షుద్రపూజలు చేస్తుంటాడు. తన దైవమైన వక్రసింఘ ఆగమనం కోసం ఎదురుచూస్తూ, తన అనుచరులతో కలిసి తపేశ్ కోసం వెతుకుతుంటాడు.

ఆ ఊళ్లో భూతాలు తిరుగుతున్నాయనే ప్రచారం ఉండటంతో పాటు, మేకలు చనిపోవడం, మనుషులు హత్యలకు గురవడం వంటి ఘటనలు కలకలం రేపుతుంటాయి. ఇలాంటి సమయంలో తపేశ్ సన్నిహితుడు గిరి నుంచి అలీషాకు ఫోన్ వస్తుంది. కొన్ని రోజుల క్రితం తవ్వకాలలో తపేశ్‌‌కు కొన్ని రహస్య వస్తువులు దొరికాయని, వాటి కారణంగా అతను ప్రమాదంలో పడే అవకాశం ఉందని గిరి చెబుతాడు.

ఈ విషయం తల్వార్‌‌కు తెలియనివ్వవద్దని హెచ్చరిస్తాడు. దీంతో తండ్రికి దొరికిన ఆ రహస్య వస్తువులేమిటి? వాటిని బంగ్లాలో ఎక్కడ దాచిపెట్టాడు? అనే విషయాలను బాబాతో కలిసి అలీషా అన్వేషించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఓ రహస్య గదిలో ఆమెకు ఓ వింత బొమ్మ కనిపిస్తుంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనుభవ్ వర్మ ద్వారా ఆ బొమ్మలకు ప్రేతాత్మలతో సంబంధం ఉందని తెలుసుకుంటుంది.

తన తండ్రి అప్సర అనే పాడుబడిన థియేటర్‌‌కు వెళ్లిన తర్వాతే కనిపించకుండా పోయాడని ఆమెకు అర్థమవుతుంది. దీంతో ముగ్గురూ కలిసి ఆ థియేటర్‌‌కు వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఆ బొమ్మలకు, ప్రేతాత్మలకు ఉన్న సంబంధం ఏమిటి? మాంత్రికుడు మహాదేశ్ అసలు ఉద్దేశం ఏమిటి? తపేశ్ ఏమయ్యాడు? అన్నదే మిగతా కథ.