ఓ వైపు నటిగా ‘ఆల్ఫా’ లాంటి క్రేజీ స్పై యాక్షన్ సినిమాతో బిజీగా ఉన్న అలియా భట్.. మరోవైపు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. డార్లింగ్స్, జిగ్రా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు ‘డోంట్ బీ షై’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఇందులో ఆమె లీడ్ రోల్ చేస్తోంది. శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో లండన్ వేదికగా జరిగిన ప్రైమ్ వీడియో ఇంటర్నేషనల్ షోకేస్‌లో వర్చువల్‌గా పాల్గొన్న అలియా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఈ చిత్ర కథాంశం శ్యామిలి ‘షై’ దాస్ అనే 20 ఏళ్ల యువతి చుట్టూ తిరుగుతుంది.
తన జీవితం చాలా పద్ధతిగా, తను అనుకున్నట్లుగానే సాగిపోతోందని నమ్ముతున్న తరుణంలో.. అనుకోకుండా ఎదురైన ఒక మలుపు ఆమె జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు, ఆమె ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. మహిళా పాత్రలు, వారి వ్యక్తిత్వాలను అద్భుతంగా ఆవిష్కరించడమే కాకుండా ఇద్దరు యువకుల పాత్రలను చూపించిన తీరు చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. పాత తరం ఛాయలను సరికొత్త కోణంలో, సరికొత్త ఎనర్జీతో దర్శకురాలు శ్రీతి తెరకెక్కిస్తున్నారు” అని అలియా భట్ చెప్పింది.
