టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ మరోసారి తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ మూవీ ' రంభ ఊర్వశి మేనక' . ఇప్పటికే ఈ మూవీ టైటిల్ తోనే మరించి క్యూరియాసిటీ క్రేయేట్ చేసింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేలా చేసింది..
'కామెడీ గోస్ కాస్మిక్' అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా స్వర్గలోకం, అప్సరసలు, కోరికలు, కామెడీని కలిపిన క్రేజీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. టీజర్‌లో చిన్నతనంలో హీరో చేతికి ఓ ప్రత్యేకమైన కోరికల పుస్తకం దొరుకుతుంది. అందులో చెప్పిన విధంగా పూజలు చేస్తే రంభ, ఊర్వశి, మేనకలు భూలోకానికి వచ్చి కోరిన కోరికలు తీరుస్తారని తెలుసుకుంటాడు. దీంతో ఏకంగా 25 ఏళ్ల పాటు ఆ ముగ్గురు అప్సరసల కోసం ఎదురుచూస్తూ పూజలు చేస్తుంటాడు. చివరకు అతడి కోరిక ఫలించి ముగ్గురూ భూమిపైకి దిగివస్తారు. కానీ అసలు అల్లరి అక్కడి నుంచే మొదలవుతుంది!
►ALSO READ | ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. షూటింగ్ లో ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ కనిపించనుండగా.. దేవేంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ తన కామెడీతో అదరగొట్టేలా కనిపిస్తున్నారు. నరేష్‌తో పాటు నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించగా.. రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
దాదాపు 14 ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ ఫాంటసీ జానర్‌లోకి రావడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా.. అల్లరి నరేష్‌కు మరోసారి తన పాత కామెడీ క్రేజ్‌ను గుర్తుచేసే హిట్ ఇస్తుందేమో చూడాలి..
