
‘పుష్ప 2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో అడ్వంచరస్ మూవీని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. సన్ పిక్చర్స్ సంస్థ హ్యూజ్ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని, బన్నీ త్రిబుల్ రోల్‌లో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనౌన్స్‌మెంట్‌తోనే హాలీవుడ్ స్థాయి సినిమా అనే అంచనాలు పెంచారు. ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాకు ఓకే చెబుతాడు అనే ఆసక్తి ఏర్పడింది.
.ఈ నేపథ్యంలో ఓ సూపర్ హీరో సినిమాకు అల్లు అర్జున్ ఓకే చెప్పినట్టు సమాచారం. మలయాళ ఇండస్ట్రీలో దర్శకుడిగానే కాక హీరోగానూ మెప్పిస్తున్న బాసిల్ జోసెఫ్.. బన్నీ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడట. నైంటీస్ కిడ్స్‌కు ఫేవరేట్ సూపర్ హీరో అయిన శక్తిమాన్ క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. నిజానికి రణ్‌వీర్ సింగ్ హీరోగా దీన్ని తెరకెక్కించాలని గతంలో ప్రయత్నాలు చేశాడు బాసిల్. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు.
ఇప్పుడదే కథను అల్లు అర్జున్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించబోతున్నాడట. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని దీపావళికి అధికారికంగా ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘మిన్నల్ మురళి’ చిత్రంతో ఈ తరహా చిత్రాలను హ్యాండిల్ చేయగలనని ఇప్పటికే ప్రూవ్ చేశాడు బాసిల్. పైగా నైంటీస్‌లో మెప్పించిన ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.