శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో జీవీకే దర్శకత్వంలో కెఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానున్న క్రమంలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సీనియర్ నటులు మురళీ మోహన్, యువహీరో అశ్విన్ బాబు అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో శివకంఠంనేని మాట్లాడుతూ ‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని గ్యారెంటీ ఇస్తున్నాం’ అని చెప్పారు.
ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ ‘చాలామంది దర్శకులు నా కళ్లు బాగుంటాయి రొమాంటిక్, ట్రెడిషనల్ మూవీస్ చేయమంటారు. కానీ ఈ మూవీ డైరెక్టర్.. హారర్ మూవీ చేయమని వచ్చారు. ఇందులో మంచి కంటెంట్ ఉంది’ అని చెప్పింది. తన నిజ జీవితానికి దగ్గరగా అల్లరిగా, సరదాగా ఉండే పాత్రను ఇందులో పోషించానని సుప్రిత చెప్పింది. మంచి కథతో వస్తున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని ఎస్తేర్ చెప్పింది. ‘టైటిల్ చూసి పొలిటికల్ సినిమా అనుకుంటున్నారు.. కానీ ఇదొక హారర్ థ్రిల్లర్. ట్రైలర్ నచ్చితే థియేటర్స్‌లో చూడండి’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. నటులు రఘుబాబు, జెమినీ సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్, డీఓపీ జె ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
