ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా ఆగస్టు 21న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోలు మాట్లాడుతూ ‘‘ఇది సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా హైదరాబాద్ బస్తీలోకి వెళ్లి అక్కడి జీవితాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. మా దర్శకుడి అత్తగారి ఇంటి పరిసరాల్లోనే షూటింగ్ చేశాం.
అక్కడి వాళ్లు కూడా మమ్మల్ని ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సినిమాను పూర్తిగా సింక్ సౌండ్‌లో చేశాం. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా టేక్ ఆపాల్సి వచ్చేది. రోడ్లపై తీసిన కొన్ని సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. మేం బస్తీల్లోనే పెరిగాం కాబట్టి తెలంగాణ యాస, బస్తీ లైఫ్ మాకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాయి. మా పాత్రలు రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లా అనిపిస్తాయి. సినిమా యూత్‌కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఇందులో హిందీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్‌లో సహజంగా వచ్చే హిందీ, ఉర్దూ పదాలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉపయోగించాం. హైదరాబాద్ భాష, యాసకు ‘అమీర్ లోగ్’ ఒక అడ్రస్‌లా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్ ద్వారా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది”అని చెప్పారు.
