మేయర్ మేక: పాలివ్వడమే కాదు.. పరిపాలిస్తోంది

మేయర్ మేక: పాలివ్వడమే కాదు.. పరిపాలిస్తోంది

వాషింగ్టన్‌ : అమెరికాలోని ఓ చిన్న పట్టణంలోని ప్రజలు మేకను మేయర్‌ గా ఎన్నుకుని దానికి బాధ్యతలు అప్పగించారు. అమెరికా చరిత్రలో గుర్తింపు తెచ్చుకున్న మాజీ అధ్యక్షుడు అబ్రహాంలింకన్‌ పేరును ఈ మేకకు పెట్టారు. ఫెయిర్‌ హావెన్‌ అనే పట్టణంలో జరిగిన ఈ ఎన్నికల్లో మేక మేయర్‌గా ఎన్నికకాగా.. శునకాలు, పిల్లులు సహా 15 ఇతర జంతువులు పాలకవర్గ సభ్యులుగా విజయం సాధించాయి. తమ పట్టణంలోని మైదానం నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ఈ ఎన్నికలు నిర్వహించామని ఫెయిర్‌ హావెన్‌ అధికారి జోసెఫ్‌ గుంటెర్‌ తెలిపారు.

కొన్ని పట్టణాల్లో మేయర్‌ గా పిల్లి సేవలందిస్తుందని పత్రికలో చదివిన తర్వాత తనకు ఈ వినూత్న ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు. 2500 మంది జనాభా కలిగిన ఈ పట్టణంలో మేయర్‌ గా లింకన్‌ ఏడాది పాటు సేవలందించనుంది. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి ఓ తార్కాణంగా జోసెఫ్‌ అభివర్ణించారు. మేయర్‌ గా లింకన్‌ సమ్మీ అనే కుక్కపై 13 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి ఎన్నికల్లో చిన్నారులను స్థానిక ఎన్నికల్లో భాగస్వాములు చేయవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేకలు పాలివ్వడమే తెలుసు కానీ..ఇప్పుడు సిటీని పరిపాలిస్తున్నాయన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అమెరికన్లు ఏం చేసినా వెరైటీగా చేస్తారంటున్నారు.