యే దిల్ మాంగే మోర్.. ట్వెల్త్‌‌ ఫెయిల్‌ మూవీపై ఆనంద్‌‌ మహీంద్ర ప్రశంసలు

యే దిల్ మాంగే మోర్.. ట్వెల్త్‌‌ ఫెయిల్‌ మూవీపై ఆనంద్‌‌ మహీంద్ర ప్రశంసలు

హిందీ చిత్రం ‘ట్వెల్త్‌‌ ఫెయిల్‌‌’... ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌‌ మహీంద్ర మనసు గెలుచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉండే ఆయన, ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ రాశారు. ఈ ఏడాది మీరు కేవలం ఒకే ఒక్క సినిమా చూడాలంటే కచ్చితంగా ‘ట్వెల్త్‌‌ ఫెయిల్’ చూడమంటూ ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. విక్రాంత్ మాస్సే హీరోగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్‌‌ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒకప్పుడు బందిపోటు దొంగలకు కేరాఫ్‌‌గా చెప్పుకునే చంబల్ ప్రాంతంలో అత్యంత పేద కుటుంబంలో పుట్టి, స్వశక్తితో ఐపిఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ రియల్‌‌ లైఫ్‌‌ స్టోరీ ఇది. ఓటీటీ రిలీజ్‌‌ తర్వాత ఈ సినిమాకు ఆదరణ మరింత పెరిగింది. లాస్ట్ వీకెండ్‌‌ ఈ సినిమా చూశానంటూ.. ఇందులోని నటీనటుల పెర్ఫార్మెన్స్‌‌ను, దర్శకుడు విధు వినోద్ చోప్రా మేకింగ్‌‌పై పొగడ్తలు కురిపించారు ఆనంద్ మహీంద్ర. హీరో విక్రాంత్ మాస్సే ఆ పాత్రలో జీవించాడని, తనకు నేషనల్ అవార్డు వస్తుందని అన్నారు. అలాగే గొప్ప సినిమా అనేది మంచి కథ నుంచే వస్తుందని విధు వినోద్ చోప్రా ప్రూవ్ చేశారన్నారు. సినిమాలోని ఇంటర్వ్యూ సీన్‌‌ మనసుకు హత్తుకునేలా ఉందని, నవ భారత నిర్మాణానికి మనం ఏం చేయాలో ఈ మూవీ మనకు చెబుతుందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. చివరగా ‘మిస్టర్ చోప్రా.. యే దిల్ మాంగే మోర్‌‌ ఫిల్మ్స్ లైక్ దిస్‌‌‌‌’ అంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన కోరారు.